close
Choose your channels

Pawan Kalyan : ఇకపై తెలంగాణపైనా ఫోకస్.. 10 మంది జనసేన ఎమ్మెల్యేలు వుండాల్సిందే : పవన్ కల్యాణ్

Wednesday, January 25, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకే పరిమితమవుతారా .. లేదంటే తెలంగాణలోనూ ఎంట్రీ ఇస్తారా అంటూ గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి ఆయన తెరదించారు. మంగళవారం కొండగట్టులోని ఆంజనేయస్వామిని దర్శించుకున్న పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోని 7 నుంచి 14 లోక్‌సభ స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందన్నారు. తెలంగాణ ప్రజలు చేసిన పోరాటాల నుంచి తాను స్పూర్తి పొందానని.. ఇక్కడ ఎవరైనా పొత్తుకు వస్తే సంతోషమన్నారు.

పార్టీ, రాజకీయాలు నీకు అవసరమా అన్నారు :

తెలంగాణలో తన రాజకీయం పరిమితమని.. పొత్తు పెట్టుకుంటే కూర్చొని మాట్లాడుకుంటామని పవన్ కల్యాణ్ వెల్లడించారు. తాను యూత్ వింగ్‌లో వున్నప్పటి నుంచి తెలంగాణ యువతలో పోరాట స్పూర్తిని చూశానని ఆయన గుర్తుచేశారు. అందరూ పేరున్న నాయకులను తీసుకుంటారని.. కానీ తాను కొత్త నాయకత్వాన్ని తీసుకోవాలని కోరుకుంటున్నానని పవన్ తెలిపారు. జనసేనలో అంతా కొత్తవాళ్లేనని ఆయన పేర్కొన్నారు. చిన్నపాటి ఉద్యోగాలకు ఇన్ని టెస్టులు పెడుతున్నారని.. మరి ఇంత పెద్ద నాయకత్వానికి ఎన్ని టెస్ట్‌లు వుంటాయని పవన్ ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల పోరాటాల నుంచి తాను నేర్చుకుంటున్నానని ఆయన తెలిపారు. తాను పార్టీ పెట్టినప్పుడు చాలా మంది నీకెందుకు పార్టీ, గొడవలు , విమర్శలు అని తనను ప్రశ్నించారని.. కానీ వాటిని తాను పట్టించుకోలేదన్నారు.

నాకు అట్టడుగున వున్న కోహినూర్‌లు కావాలి :

తనకు అట్టడుగున వున్న వర్గాల్లో కోహినూర్ వజ్రాలు కావాలని పవన్ కల్యాణ్ అన్నారు. సమాజానికి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చానని.. అవసరమైతే వీధి పోరాటాలకు సిద్ధమని జనసేనాని స్పష్టం చేశారు. ఏపీ అభివృద్ధి చెందకపోతే.. తెలంగాణ యువతకు నష్టమన్న ఆయన, అక్కడి నుంచి వలసలు రావడంతో ఇక్కడి యువతకు ఉద్యోగ అవకాశాలు తగ్గుతున్నాయని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. అందుకే తాను ఆంధ్రప్రదేశ్‌పై దృష్టి పెడుతున్నానని, ఇకపై తెలంగాణపైనా దృష్టి పెడతానని పవన్ తెలిపారు. అన్ని పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలనేది తన అభిమతమన్నారు. బీజేపీ కలిసి వచ్చేలా ప్రయత్నాలు చేస్తానని .. కలిసి రాకపోతే వేరే పార్టీల వైపు చూడాల్సి వస్తుందని పవన్ పేర్కొన్నారు. 2014 కాంబినేషన్‌పై కాలమే నిర్ణయిస్తుందని.. పవన్ చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.