close
Choose your channels

కేజీఎఫ్‌ పుట్టుక వెనుక... ఆ గజదొంగ స్పూర్తితోనే రాకీ బాయ్ క్యారెక్టర్ పుట్టిందా...?

Friday, April 22, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కేజీఎఫ్ 2... ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే . కేజీఎఫ్ 1 విజయంతో వచ్చిన బజ్‌తో చాప్టర్ 2 కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. దక్షిణాదితో పాటు హిందీలోనూ కేజీఎఫ్ 2 దుమ్ము రేపుతోంది. ఇప్పటికే 500 కోట్ల మార్క్‌ను క్రాస్ చేసిన ఈ చిత్రం వెయ్యి కోట్ల దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో యశ్‌లకు దేశవ్యాప్తంగా తిరుగులేని స్టార్ డమ్ లభించింది. బాలీవుడ్, టాలీవుడ్ మేకర్స్ కూడా వీరిద్దరితో సినిమా తీసేందుకు క్యూకడుతున్నారు. అయితే జనాన్ని ఇంతగా ఆకట్టుకుంటున్న కేజీఎఫ్ కథ కల్పితం కాదు.. దీని వెనుక నిజ జీవిత కథ వుందట. రాకీ భాయ్ పాత్రకి స్పూర్తి ‘‘తంగం’’ అనే రియల్ లైఫ్ డాన్. ఈయన 1997లో పోలీసుల ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయాడు.

ప్రస్తుతం మనకు దొరుకుతున్న మీడియా కథనాల ప్రకారం.. గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ తర్వాత రెండవ వ్యక్తిగా తంగం పేరుగాంచాడు. అతనిని కాల్చి చంపబడటానికి కొద్ది రోజుల ముందు 1997 నాటి పత్రికల్ని పరిశీలిస్తే.. తంగం పేరు మీద 42 నేరాలు ఉన్నాయని ... ఒక దుకాణంలో రూ. 1.5 లక్షల విలువైన ఆభరణాలను దొంగిలించాడని ఒక పత్రిక కథనం పేర్కొంది. తంగం .. వీరప్పన్ లాగా `రాబిన్ హుడ్` (ధనవంతుల్ని దోచి పేదలు పంచిపెట్టడం) అయినందున స్థానికుల అభిమానాన్ని పొందాడు.

పోలీసులకు కొరకరాని కొయ్యగా మారిన తంగంపై షూట్ ఎట్ సైట్ ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా కుప్పంలో 1997 డిసెంబర్ 27న కేజీఎఫ్ పోలీసుల చేతిలో హతమయ్యాడు. మరణించే సమయానికి తంగం వయసు కేవలం 25 సంవత్సరాలు. ఆ తర్వాత పోలీసులు తంగం సోదరులు... సగాయం- గోపి- జయకుమార్‌లను కూడా ఎన్ కౌంటర్‌లో హతమార్చారు. అయితే ఈ ఎన్ కౌంటర్‌లపై సీబీఐ విచారణ కోరుతూ వారి తల్లి పౌలి పిటిషన్ దాఖలు చేయగా.. 2012లో సగాయంతో పాటు మరో ఆరుగురిని ఎన్‌కౌంటర్ చేసినందుకు పోలీసు అధికారి రమేష్ కుమార్‌పై సీబీఐ అభియోగాలు మోపింది.

ఇక కేజీఎఫ్ చాప్టర్ 2 షూటింగ్‌పై స్టే విధించాలని కోరుతూ పౌలి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేజీఎఫ్ 1లో తన కొడుకును ప్రతికూలంగా చిత్రీకరించారని భావించింది. పౌలి వాదన ప్రకారం.. హీరో పాత్రను మంచిగా చిత్రీకరిస్తానని మూవీ యూనిట్ ఆమెకు హామీ ఇచ్చింది. కానీ అలా చేయలేదు. అయితే దర్శకుడు ప్రశాంత్ నీల్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ఈ సినిమా ‘‘తంగం’’ జీవిత కథ ఆధారంగా తీసింది కాదని తేల్చిచెప్పేశాడు. అయితే కేజీఎఫ్ పోస్టర్‌లో `వాస్తవ కథ ఆధారంగా` అని పేర్కొన్నారు. మరి ప్రశాంత్ నీల్ చెప్పినట్లు ఇది తంగంది కాకపోతే ఎవరిదో స్పష్టంగా వెల్లడించలేదు.

ఇకపోతే.. కేజీఎఫ్‌కు, తంగం జీవితంలోని కొన్ని సంఘటనలు దగ్గరి సారూప్యతలు కనిపిస్తాయి. ఇందులో చెప్పుకోవాల్సింది తంగం తల్లి... పౌలి. కేజీఎఫ్‌లోనూ తల్లిపాత్రకు ఇంపార్టెన్స్ ఇచ్చాడు ప్రశాంత్. తల్లి కోరిక, ఆశయాల కోసం పోరాడే కొడుకుగా రాకీ క్యారెక్టర్‌ను తీర్చిదిద్దారు. తంగంపై పోలీసులు షూట్ ఎట్ సైట్ ఆదేశాలు జారీ చేసినట్లే .. కేజీఎఫ్‌లో రాకీకి మరణశిక్ష విధించాలని ప్రధాని కోరుతారు. సినిమాలోని అధీర, గరుడ క్యారెక్టర్లు ఆ రోజుల్లో కేజీఎఫ్‌ని నియంత్రించిన ముఠాల నుండి ప్రేరణ పొంది ఉండవచ్చని విశ్లేషకులు అంటున్నారు.

తంగం గ్యాంగ్ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ సహా చుట్టుపక్కల బంగారు దుకాణాలలో దోచుకునే వారని పత్రికల్లో కథనాలను బట్టి అంచనా వేస్తున్నారు. ఇక్కడ దోచుకున్న మొత్తాన్ని ఆ ప్రాంతంలోని పేదలకు తంగం పంచిపెట్టేవాడు.. సినిమాలోనూ కేజీఎఫ్‌లో దయనీయ స్థితిలో వున్న కార్మికులకు రాకీ బాయ్ అండగా నిలబడతాడు. ఎవరి జీవిత కథో తెలియనప్పటికీ.. కేజీఎఫ్ మాత్రం దేశ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిందన్నది మాత్రం వాస్తవం. హత్య జరిగి దాదాపు పాతికేళ్లు గడుస్తున్న నేపథ్యంలో ‘‘తంగం’’ గురించి జనం అన్వేషించే ప్రయత్నం చేయవచ్చు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.