close
Choose your channels

కేసీఆర్‌తో తమిళ స్టార్ హీరో విజయ్ భేటీ.. ఉలిక్కిపడ్డ కోలీవుడ్, టాలీవుడ్

Thursday, May 19, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తమిళ అగ్ర కథానాయకుడు, ఇళయ దళపతి విజయ్ బుధవారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. ఈ రోజు సాయంత్రం ప్రగతి భవన్‌కు చేరుకున్న విజయ్‌కు పుష్పగుచ్చం ఇచ్చి కేసీఆర్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయనతో కొద్దిసేపు ముచ్చటించారు. అనంతరం శాలువా కప్పి, జ్ఞాపికను అందజేశారు సీఎం. ఈ భేటీలో దర్శకుడు వంశీ పైడిపల్లి, ఎంపీ సంతోష్ కుమార్ కూడా ఉండడం విశేషం. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్‌గా మారాయి.

ఇకపోతే విజయ్, కేసీఆర్ మీటింగ్ ప్రస్తుతం కోలీవుడ్, టాలీవుడ్‌లతో పాటు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గత కొన్ని రోజుల నుంచి విజయ్ రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నారని తమిళనాట వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ ప్లానింగ్‌లో భాగంగానే విజయ్ ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నాడా..? అని టాక్ నడుస్తోంది.

విజయ్‌కి రాజకీయాలపై తొలి నుంచి ఆసక్తి వుంది. అది డైరెక్ట్‌గా చెప్పకపోయినా తాను చేసే పనులను బట్టి అర్ధమవుతుంది. విజయ్ తండ్రి ఆల్రెడీ పార్టీ పెట్టడం.. తర్వాత దాన్ని రద్దు చేయడం, అయినప్పటికీ ఆఫీస్ అలాగే ఉంచి కార్యకలాపాలు జరపడం, ఇటీవల విజయ్ పార్టీ పేరుతో అభిమానులు స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి గెలవడం, గెలిచిన వారిని విజయ్ ఇంటికి పిలిచి అభినందించడం, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ని విజయ్ కలవడం లాంటి పరిణామాలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఇవన్నీ చూస్తే ఇళయ దళపతి ఏదో ఒక రోజు తమిళ రాజకీయాల్లోకి రావడం తథ్యమనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.

ఇక.. ప్రస్తుతం విజయ్, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ షూటింగ్ కోసం హైదరాబాద్‌లోనే కొన్నిరోజుల నుంచి ఉంటున్నాడు. గతంలో టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో విజయ్ పాల్గొన్న విషయం విదితమే. ఈ పరిచయం వలన హైదరాబాద్‌లో ఉంటున్న విజయ్‌ను సంతోష్ కుమార్, కేసీఆర్‌ను కలిసే విధంగా ఏర్పాటు చేసారని, అంతేతప్ప ఇందులో ఎలాంటి రాజకీయం లేదని విజయ్ ఫ్యాన్స్ చెబుతున్నారు. మరి ఇద్దరి మధ్య ఎలాంటి అంశాలు చర్చకు వచ్చాయనే దానిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం వుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.