close
Choose your channels

ఒక్కొక్కరు ఒక్కో కోణంలో వార్తలు చూపిస్తున్నారు తప్ప వాస్తవం చూపించడం లేదు - టి.ఆర్.ఎస్ ఎం.పి కవిత

Saturday, August 27, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
ఆర్పీ ప‌ట్నాయ‌క్ న‌టిస్తూ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించిన చిత్రం మ‌న‌లో ఒక‌డు. విభిన్న క‌థాంశంలో రూపొందిన ఈ చిత్రంలో నువ్వు నేను ఫేమ్ అనితా హెచ్ రెడ్డి క‌థానాయిక‌గా న‌టించారు. ఈ చిత్రాన్ని యూనిక్రాఫ్ట్ మూవీ పతాకం పై జి.సి. జగన్ మోహన్ నిర్మించారు. మ‌న‌లో ఒక‌డు ఆడియో రిలీజ్ కార్య‌క్ర‌మం సినీ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో అన్న‌పూర్ణ సెవెన్ ఏక‌ర్స్ లో ఘ‌నంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి జె.డి.ల‌క్ష్మీనారాయ‌ణ‌, రాజకీయ నాయ‌కురాలు క‌విత ముఖ్య అతిధులుగా హాజ‌ర‌య్యారు. జె.డి.ల‌క్ష్మీనారాయ‌ణ మ‌న‌లో ఒక‌డు ఆడియోను ఆవిష్క‌రించి తొలి సిడీని ఆర్పీ ప‌ట్నాయ‌క్ కి అందించారు.
ఈ సంద‌ర్భంగా సీనియ‌ర్ న‌టుడు, ర‌చ‌యిత గొల్ల‌పూడి మారుతిరావు మాట్లాడుతూ....నేను సినిమా రంగంలో ప్ర‌వేశించి 53 ఏళ్లు అయ్యింది. మీడియాలో ప్ర‌వేశించి 56 ఏళ్లు అయ్యింది. అన్నింటి కంటే ప‌దునైంది సినిమా. మీడియా... చెప్పే మీడియా, అమ్మే మీడియా అవ్వ‌డం ఎక్కువుగా జ‌రుగుతున్న నేప‌ధ్యంలో మ‌న‌లో ఒక‌డు, మంచి క‌థ‌కుడు ఆర్పీసాహ‌సం చేసి సామాజికి బాధ్య‌త‌తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు. బ‌ల‌మైన మాధ్య‌మాన్ని సామాన్యుడు న‌ష్ట‌పోతున్నాడు. ఈ నిజాన్ని నా అభిమాని, అలాగే నేను అభిమానించే ఆర్పీ ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నాడు. ఏదో ప్ర‌త్యేక‌త లేనిదే సినిమా తీయ‌డు. మ‌న‌లో ఒక‌డు ఒక గొప్ప ప్ర‌యోగం. ఈ చిత్రం ద్వారా మీడియాకి కూడా మంచి జ‌ర‌గుతుంద‌ని ఆశిస్తున్నాను అన్నారు.
టి.ఆర్.ఎస్ ఎం.పి క‌విత మాట్లాడుతూ...మ‌నం ఒక ప‌త్రిక చ‌దివితే అస‌లు ఏం జ‌రిగిందో తెలియ‌డం లేదు. అన్ని పేప‌ర్లు చ‌ద‌వితే కొంచెం వాస్త‌వం తెలుస్తుంది. మ‌న‌కి 17 న్యూస్ ఛాన‌ల్స్ ఉంటే ఒక్కొక్క‌రు ఒక్కో కోణంలో వార్త‌లు చూపిస్తున్నారు త‌ప్ప వాస్త‌వం చూపించ‌డం లేదు. ఇలాంటి క‌న్ ఫ్యూజన్ ఉన్న టైమ్ లో ఆర్పీ గారు ఈ సినిమా చేయ‌డం అభినంద‌నీయం. తెలంగాణ ఉద్య‌మంలో చ‌నిపోయిన వాళ్ల‌ను న్యూస్ ఛాన‌ల్స్ లో ప‌దే ప‌దే చూపిస్తూ రెచ్చ‌గొట్టారు. మీడియా హ‌ద్దులు పాటించాలి. అలాగే మీడియా సంస్థ‌లు పెరిగిపోవ‌డం వ‌ల‌న కొన్ని సంస్థ‌లు జీతాలు ఇవ్వ‌లేక మూసేస్తున్నారు. గ‌వ‌ర్న‌మెంట్ కూడా ఏమీ చేయ‌లేని ప‌రిస్థితి. నేను సినిమాలు త‌క్కువుగా చూస్తుంటాను. ఈ ట్రైల‌ర్ చూసిన త‌ర్వాత ఈ సినిమా చూడాల‌నుకుంటున్నాను అన్నారు.
హీరోయిన్ అనితా హెచ్ రెడ్డి మాట్లాడుతూ...నువ్వు నేను త‌ర్వాత మ‌న‌లో ఒక‌డు చిత్రంతో రీ ఎంట్రీ ఇవ్వ‌డం చాలా సంతోషంగా ఉంది. ఆర్పీ ప‌ట్నాయ‌క్ గారు బ్రిలియంట్ డైరెక్ట‌ర్. మా చిత్రాన్ని ఆద‌రించి మంచి విజ‌యాన్ని అందిస్తార‌ని ఆశిస్తున్నాను అన్నారు.
జె.డి.ల‌క్ష్మీనారాయ‌ణ మాట్లాడుతూ....ప్ర‌భంజ‌నం ఆడియో ఫంక్ష‌న్ కి వ‌చ్చాను. మ‌ళ్లీ ఇప్పుడు ఆర్పీ గారి మ‌న‌లో ఒక‌డు ఆడియో ఫంక్ష‌న్ కి రావ‌డం ఆనందంగా ఉంది. ప్ర‌భంజ‌నం టైమ్ లో ఆర్పీగార్ని క‌లిసాను. సామాజిక స్కృహ ఉన్న మ‌నిషి అనిపించింది. మ‌న‌లో ఒక‌డు టీజ‌ర్ చూసాక ఖ‌చ్చితంగా సామాన్యుడికి ఎంత శ‌క్తి ఉందో చూపించే సినిమా అనిపించింది. ప్ర‌జాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్ గా పిలువ‌బ‌డే ప్రెస్ చాలా ముఖ్య‌మైన‌ది. స‌మాజంలో ప‌రివ‌ర్త‌న తీసుకురావాలంటే... పొలిటిషియ‌న్ - ప్రెస్ రోల్ ముఖ్యం. పొలిటిషియ‌న్ - ప్రెస్ స‌రిగ్గా ప‌నిచేస్తేనే నిజ‌మైన ప్ర‌జాస్వామ్యం చూడ‌గ‌లం. ఈ చిత్రం ద్వారా సామాన్యుడికి ఆత్మ‌విశ్వాసం పెరుగుతుంది అని ఆశిస్తున్నాను అన్నారు.
ఆర్.పి.ప‌ట్నాయ‌క్ మాట్లాడుతూ...మా చిత్రం ఆడియో ఆవిష్క‌ర‌ణ‌కు విచ్చేసిన జె.డి. ల‌క్ష్మీనారాయ‌ణ గార్కి, క‌విత గార్కి థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను. ఈ చిత్రానికి క‌థ‌, స్ర్కీన్ ప్లే ద‌ర్శ‌క‌త్వం నేను చేసినా క్రియేటివ్ హెడ్ గా వెన‌కుండి అంతా చూసుకున్న‌ది మాత్రం మా అన్న‌య్య గౌత‌మ్ ప‌ట్నాయ‌క్. టీజ‌ర్ రిలీజ్ చేసిన త‌ర్వాత మీడియా ఫ్రెండ్స్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.ముఖ్యంగా రెండు రోజుల్లోనే టీజ‌ర్ కి ల‌క్ష వ్యూస్ రావ‌డం సంతోషంగా ఉంది. జ‌ర్న‌లిస్ట్ ల‌ను త‌ప్పుగా ఎక్క‌డా చూపించ‌లేదు. అయితే...ఎక్క‌డో ఒక ద‌గ్గ‌ర ఈగో ఫ్యాక్ట‌ర్ ఉంది అని చూపించాను. ఈ సినిమా ప్రారంభోత్స‌వానికి విచ్చేసిన రాధాకృష్ణ గార్కి, టీజ‌ర్ రిలీజ్ చేసిన మీడియా పితామ‌హులు రామోజీరావు గార్కి ధ‌న్య‌వాదాలు తెలియ‌చేస్తున్నాను అన్నారు.
ద‌ర్శ‌కుడు చంద్ర‌సిద్దార్థ మాట్లాడుతూ...ఆర్పీ నాకు క్లోజ్ ఫ్రెండ్. సంగీత ద‌ర్శ‌కుడుగా స‌క్సెస్ లో ఉన్న టైమ్ లో ద‌ర్శ‌కుడుగా మారి ఇలాంటి సినిమాలు చేయ‌డం నిజంగా అభినంద‌నీయం. నేనైతే ఇలా చేయ‌లేను. కెరీర్ స్టార్ట్ చేయ‌క‌ముందు మాలో ఒక‌డు...ఇప్పుడు మ‌న‌లో ఒక‌డు. ఆర్పీ స‌క్సెస్ సాధించాలి అని కోరుకుంటున్నాను అన్నారు.
న‌టుడు బెన‌ర్జి మాట్లాడుతూ...36 సంవ‌త్స‌రాలుగా ఇండ‌స్ట్రీలో ఉన్నాను. ఎన్టీఆర్, ఎ.ఎన్.ఆర్, ఎస్.వి.ఆర్ ల‌తో వ‌ర్క్ చేయ‌డం అదృష్టంగా భావిస్తున్నాను. ఆర్పీ నా త‌మ్ముడు లాంటివాడు. ఆర్పీ తీసిన ప్ర‌తి సినిమాలో న‌టించాను. ఇలాంటి సినిమా తీయ‌డానికి గ‌ట్స్ ఉండాలి. చాలా మంచి సినిమా ఇది. పెద్ద విజ‌యం సాధించాలి అన్నారు.
సురేష్ కొండేటి మాట్లాడుతూ...ఆర్పీ పాట‌లు చాలా మందికి స్పూర్తిగా నిలిచాయి. న‌టుడు, ద‌ర్శ‌కుడుగా మారి డిఫ‌రెంట్ మూవీస్ చేయ‌డం సంతోషంగా ఉంది. నేను సంతోషం అనే ప‌త్రిక పెట్ట‌డానికి కార‌ణం ఆర్పీ. సంతోషం రీ రికార్డింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు ఈ సినిమా ఎలా ఉంటుంది అని అడిగితే చాలా బాగుంటుంది అని చెప్పారు. దాంతో సంతోషం చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసాను. ఈ సినిమా ద్వారా వ‌చ్చిన డ‌బ్బుల‌తోనే సంతోషం ప‌త్రిక స్టార్ట్ చేసాను. ఈ చిత్రం ద్వారా అనిత రీ ఎంట్రీ ఇవ్వడం సంతోషంగా ఉంది అన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.