close
Choose your channels

చైతన్య సభ గ్రాండ్ సక్సెస్.. ఏపీకి వచ్చి బాబుకు మోదీ సవాల్!

Sunday, February 10, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

చైతన్య సభ గ్రాండ్ సక్సెస్.. ఏపీకి వచ్చి బాబుకు మోదీ సవాల్!

గుంటూరు జిల్లా ఏటుకూరులో ఈరోజు నిర్వహించిన ‘ప్రజా చైతన్య సభ’ గ్రాండ్ సక్సెస్ అయ్యిందని చెప్పుకోవచ్చు.! రెండ్రోజుల ముందు నుంచే తెలుగుతమ్ముళ్లు, ప్రజలు రాష్ట్రవ్యాప్తంగా పోస్టర్లు, ఆందోళనలు చేపట్టినప్పటికీ ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా సభ సజావుగానే జరిగిపోయింది. మోదీ సభకు జనాలు రారు అని అందరూ అనుకున్నారు కానీ.. మోదీ వచ్చి ఏం చెబుతారు..? చంద్రబాబు గురించి ఏం చెప్పబోతున్నారు..? అనే విషయాలను వినడానికి జనాలు ఎంతో ఆసక్తిగా సభకు తరలిరావడంతో కమలనాథులు ఆనందంలో మునిగితేలుతున్నారు. తన ప్రసంగం మొదట్లోనే తెలుగు మాట్లాడిన మోదీ అందర్నీ ఆశ్చర్యపరిచారు. సుమారు గంటన్నరకు పైగా మోదీ ప్రసంగించడం గమనార్హం.

తెలుగులో ప్రసంగం ప్రారంభం..

"అమరావతిని ‘ఆంధ్రా ఆక్స్ ఫర్డ్’ అనేవారు. దళితరత్నం, కవికోకిల గుర్రం జాషువా, మహాకవి తిక్కన జన్మించిన గుంటూరు జిల్లా ప్రజలకు నమస్కారం అని అన్నారు. ప్రజల స్నేహపూర్వక స్వాగతం, ఉత్సాహమే తనను చురుగ్గా పనిచేసేలా చేస్తోంది.
స్వాతంత్ర్య సమరయోధుడు వావిలాల గోపాలకృష్ణయ్య, నాయుడమ్మ సహా ఈ గడ్డపై జన్మించిన హేమాహేమీలకు నమస్కరిస్తున్నాను. అమరావతి కేవలం ఆంధ్రప్రదేశ్ కే కాకుండా దేశానికి మార్గదర్శిగా, దిక్సూచిగా మారబోతోంది. అమరావతికి ఎంతో గొప్ప చరిత్ర ఉంది. ఇక్కడి పురాతత్వ కట్టడాలను పరిరక్షించడానికి హృదయ్ పథకంలో చేర్చాము.
అమరావతిని గతంలో ఆంధ్రా ఆక్స్ ఫర్డ్‌గా అభివర్ణించేవారు" అని మోదీ ఆంధ్ర ప్రజలను ఆకట్టుకునే ప్రసంగం చేశారు.

గో బ్యాక్‌‌పై మోదీ చమత్కారం..

ఏపీ వ్యాప్తంగా మరీ ముఖ్యంగా గుంటూరు జిల్లాలో ‘మోదీ గో బ్యాక్’ అని పోస్టర్లు పెద్ద ఎత్తున వెలిశాయి. ఈ విషయాలన్నింటినీ ఏపీ బీజేపీ నేతలు మోదీకి చేరవేయడంతో ఈ పోస్టర్లు, నినాదాలను సైతం మోదీ తనకు అనుకూలంగా మార్చుకుని చమత్కిరిస్తూ పరోక్షంగా కౌంటర్ల వర్షం కురిపించారు. "సాధారణంగా టీచర్లు క్లాసులో విద్యార్థులను పిలిచి, ఏదైనా బోర్డుపై రాయాలని చెబుతారనీ, ఆ తర్వాత గో బ్యాక్ (వెళ్లి కూర్చో) అనేవారని, ఇప్పుడు టీడీపీ నేతలు తనను ఢిల్లీకి వెళ్లి ప్రధాని కుర్చీపై మరోసారి కూర్చోవాలని ‘గో బ్యాక్’ అని చెబుతున్నారు. ఇందుకోసం టీడీపీ నేతలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నాను. దేశంలోని కోట్లాది మంది భారతీయులు తనను మళ్లీ ప్రధానిగా ఎన్నుకునే పనిలోనే బిజీగా ఉన్నారు" అని ప్రధాని మోదీ చమత్కరించారు.

బాబుకు బాగా తెలుసు.. నాకు తెలియదు!
" రాజకీయ ప్రయోజనాల కోసమే చంద్రబాబు మహాకూటమిలో చేరారు. మహాకూటమిలోని ప్రతీఒక్కరిపై దేశాన్ని మోసం చేసిన కేసులు ఉన్నాయి. నాకు సంపద సృష్టించడం రాదు.. కానీ నాకు మాత్రమే సంపద సృష్టి తెలుసని చంద్రబాబు చెప్పినట్లు పేపర్‌లో చదివాను. అవును ఆయన చెప్పింది నిజమే. చందబ్రాబుకు సంపద సృష్టించడం బాగా తెలుసు. అమరావతి నుంచి పోలవరం వరకూ తన కోసం సంపద సృష్టించుకోవడంలో ఆయన చాలా బిజీగా ఉన్నారు. అందుకే ఈ కాపలాదారు (మోదీ) అంటే భయం వేస్తోంది" అని ప్రధాని మోదీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

డిక్షనరీ ఉన్న తిట్టన్నీ నాపైనే..!

"ఏపీ సంస్కారం చాలా గొప్పది. కానీ చంద్రబాబు వాడుతున్న భాష సరిగ్గా లేదు. రోజూ ఒక కొత్త దూషణ చొప్పున డిక్షనరీలో ఉన్న తిట్లు అన్నింటిని చంద్రబాబు నాకోసం రిజర్వు చేశారు. దేశం కోసం సంపద సృష్టించడం కోసమే ప్రజలు బీజేపీకి అధికారం అప్పగించారనీ, సొంత ధనార్జన కోసం కాదు. యువత, మహిళలు, రైతులు సంపదను సృష్టించే పనిచేస్తున్నారు. వారికి పారదర్శకమైన వ్యవస్థ నిర్మించడం మాత్రమే ప్రభుత్వ బాధ్యత. బీజేపీ ప్రభుత్వం అందరి గురించి ఆలోచిస్తుందనీ, కేవలం నా కుమారుడు, కుమార్తెకే పరిమితం కాకూడదు" అని మోదీ చెప్పుకొచ్చారు.

మోదీ నోట ఎన్టీఆర్ మాట..!

"ఏపీకి అన్యాయం చేసిన కాంగ్రెస్‌ను ఎన్టీఆర్ దుష్టులు అనేవారు. అలాంటి పార్టీతోనే ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు దోస్తీ చేస్తున్నారు. ఈ పొత్తును చూసి ఎన్టీఆర్ ఆత్మ ఎక్కడున్నా క్షోభిస్తూ ఉంటుంది. నిజాలు ప్రజలకు తెలియకూడదని లోకేశ్ తండ్రి భావిస్తున్నారనీ, ఈ నిజాలను చెప్పడానికే నేను ఏపీకి వచ్చాను. అధికారంలో ఉండి ఎన్నికలలో గెలిచే సత్తా చంద్రబాబుకు లేదు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామని చంద్రబాబుకు భయం పట్టుకుంది. తన కుమారుడు లోకేశ్ ను రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఏపీ ప్రజలపై రుద్దాలని ఆయన చూస్తున్నారు. తాను ధనికుడిని ఎలా అయ్యానో ప్రజలకు తెలుస్తుందన్న భయంతో బాబుకు నిద్ర పట్టడం లేదనీ, వణుకుతున్నారు. మోదీ ప్రభుత్వం ఇచ్చిన ప్రజల సొమ్ముకు లెక్కలు అడగడంతో చంద్రబాబు భయపడుతున్నారు" అని మోదీ చెప్పుకొచ్చారు.

ఆంధ్రా ప్రజలారా.. మేల్కొనండి!

"ఆంధ్రా ప్రజలారా.. మేల్కొనండి.. రేపు చంద్రబాబు ఫొటోలు దిగడానికి ఢిల్లీకి వెళుతున్నారు. వెంట భారీ మందీమార్బలంతో ఢిల్లీకి వస్తున్నారు. బీజేపీ సొంత నిధులతో గుంటూరు సభ పెడితే, టీడీపీ నేతలు ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు తీసుకుని ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు. ఏపీ ప్రజలు చంద్రబాబును నిలదీయాలి. దమ్ముంటే ఢిల్లీకి రాకముందు, నన్ను తిట్టేముందు ఏపీ ప్రజలకు ఖర్చుపై లెక్కలు చెప్పి రా" అని చంద్రబాబుకు మోదీ సవాల్ విసిరారు.

ఎస్.. బాబు సీనియరే..!

"అవును, చంద్రబాబు సీనియరే.. మామకు వెన్నుపోటు పొడవడంలో సీనియర్! చంద్రబాబుకు ఇప్పుడు ఏమయిందో అని నాకు ఆందోళనగా ఉంది. ఎందుకంటే చంద్రబాబు మాటిమాటికీ ‘నేను మోదీ కంటే సీనియర్’ అని చెప్పుకుంటున్నారు. నా కంటే చంద్రబాబు సీనియర్ అయితే వచ్చిన ఇబ్బంది ఏంటి..?. చంద్రబాబు సీనియర్ కాబట్టే ఆయన్ను ఎన్నడూ అగౌరవించలేదు. అయన్ను ప్రతీసారి గౌరవించా. మిత్రపక్షాలను మార్చడంలో, పార్టీల ఫిరాయింపులు చేయడంలో, సొంత మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడవడంలో, ఒక ఎన్నిక తర్వాత మరో ఎన్నికల్లో ఓడిపోవడంలో మాత్రమే చంద్రబాబు సీనియర్. ఈరోజు ఓ రాజకీయ పార్టీని తిట్టి, రేపు వారి ఒళ్లోనే కూర్చోవడంలో కూడా చంద్రబాబు సీనియర్. ఎన్టీఆర్ కుర్చీని అందుకున్న వ్యక్తి(చంద్రబాబు) ఆయన కలలను నిజం చేస్తానని చెప్పాడా? లేదా? ఎన్టీఆర్ అడుగుజాడల్లో నడుస్తానని చెప్పారా? లేదా? కానీ ఈరోజు ఎన్టీఆర్ మాటలకు గౌరవం ఇస్తున్నారా? ఈ విషయం సామాన్యులకు కూడా అర్థం అవుతోంది. కానీ చంద్రబాబు లాంటి సీనియర్ లీడర్లకు ఎందుకు అర్థం కావడం లేదు" అని ఈ సందర్భంగా చంద్రబాబుపై మోదీ ప్రశ్నల వర్షం కురిపించారు.

బాబు తప్పుడు మాటలు కాదని..!

"చంద్రబాబు తప్పుడు మాటలను కాదని రాష్ట్ర ప్రజలు భారీ సంఖ్యలో గుంటూరు సభకు వచ్చారు. ఏపీలో తండ్రీకొడుకుల (చంద్రబాబు-లోకేశ్) అవినీతి ప్రభుత్వం పోవాల్సిన సమయం ఆసన్నమయింది. అవినీతి రహిత ప్రభుత్వాన్ని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల తర్వాత అవినీతి రహిత ప్రభుత్వం ఏర్పడుతుంది.

సాధారణంగా ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు దిష్టి తగలకుండా పెద్దలు నల్ల చుక్క పెడతారు. కానీ గుంటూరులో జరుగుతున్న బీజేపీ సభకు దిష్టి తగలకుండా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్, టీడీపీ నేతలు నల్ల బెలూన్లను ఎగురవేశారు. ఇందుకోసం ధన్యవాదాలు" తెలిపిన నరేంద్ర మోదీ జై ఆంధ్రా, భారత్ మాతాకీ జై అని తన ప్రసంగాన్ని.. సభను ముగించేశారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.