Pawan Kalyan:ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఇక్కడే పోరాటం చేశా: పవన్ కల్యాణ్
Send us your feedback to audioarticles@vaarta.com
జనసేనకు యువతే పెద్ద బలమని.. రాష్ట్రంలో ఆరున్నర లక్షల క్యాడర్ ఉందని జనసేనాని పవన్ కల్యాణ్ తెలిపారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నేతలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. పవన్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో నాదెండ్ల మనోహర్, నాగబాబు, రాష్ట్రస్థాయి నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల యువత కూడా మనకు మద్దతిస్తున్నారని పేర్కొన్నారు. జనసేన యువత బలం చూసి బీజేపీ పెద్దలే ఆశ్చర్యపోయారన్నారు. తన భావజాలాన్ని నమ్మే యువత పార్టీలోకి వస్తున్నారు. యువత ఆదరణ చూసే తెలంగాణలో 8 చోట్ల పోటీ చేశాం. మాజీ సీఎం కుమార్తె, సీఎం సోదరిగా ఉన్న వారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి నిలపలేకపోయారు. తెలంగాణలో నేను పెద్దగా పర్యటనలు చేయలేదు. నా భావజాలం నచ్చి నాతో కలిసి యువత అడుగులు వేసింది. ఎనిమిది స్థానాల్లో వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పోటీ చేశారు" అన్నారు.
పోరాటమే గుర్తింపు ఇస్తుంది..
"నా సినిమాలు ఆపేసినా, నేను బసచేసిన హోటల్‌కు వచ్చి బెదిరించి ఇబ్బంది పెట్టినా.. మన పోరాటం మనమే చేసుకున్నాం తప్ప ఏనాడూ జాతీయ స్థాయి నాయకుల వద్దకు వెళ్లి మీ సహాయం కావాలని చేయిచాచి అడగలేదు. ఎందుకంటే ఇది మన నేల.. మన పోరాటం. కుదిరితే మనం వారికి బలం అవ్వాలి. కానీ, మనం బలం చూపించకపోతే వాళ్లు గుర్తింపు ఇవ్వరు. పోరాటం చేసే వాళ్లనే వారు గుర్తిస్తారు. స్వార్థం వదిలేయాలని నాయకులను కోరుతున్నా. చేసే పని, పోరాటమే మనకు గుర్తింపు ఇస్తుంది’’ అని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
ప్రజల కోసమే ఆ పార్టీలతో కలిశా..
"బీజేపీ, టీడీపీ, కమ్యూనిస్టులతో ఎలా కలుస్తారని నన్ను అంటున్నారు. అసలు నన్ను విమర్శించే అర్హత వైసీపీలో ఎవరికీ లేదు. నేను ఏ నిర్ణయం తీసుకున్నా అది ప్రజలు క్షేమం, రాష్ట్ర అభివృద్ధే ముఖ్యంగా తీసుకుంటాను. నేను మొదట్నుంచీ పదవులు కోరుకోలేదు. స్వార్థం వదిలేయాలని నేతలను కోరుతున్నాను. చేసే పని, పోరాటమే మనకు గుర్తింపు ఇస్తుంది. హైదరాబాద్‌లో పోలింగ్ శాతం 50 కూడా ఉండకపోవడం బాధకరం. యువత ఓటింగ్‌కు పూర్తిగా దూరమయ్యారు. ఇది మంచి పరిణామం కాదు. యువత ధైర్యంగా ముందుకు వచ్చి ఓటు వేయాలి" అని పవన్ పిలుపునిచ్చారు.
కులాల ఉచ్చులో చిక్కుకోవద్దు..
"వైసీపీ నేతలు వేసే కులాల ఉచ్చులో చిక్కుకోవద్దు. ఏపీ సుస్థిరత, సమైక్యత, అభివృద్ధి కోసమే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నాం. పొత్తు గురించి వ్యతిరేకంగా మాట్లాడేవారు వైకాపా కోవర్టులే. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పనిచేశాయి. వైసీపీ బెదిరింపులను తట్టుకునేందుకు కలిసి పనిచేస్తున్నామని వాళ్లు చెప్పారు. మెగాస్టార్, సూపర్ స్టార్‌ను కూడా వీళ్లు బెదిరిస్తారు. అవమానం జరిగినా.. దెబ్బపడినా ఎప్పటికీ మరిచిపోను. ఒక కులం మీద రాజకీయాలు నడపలేం. సాధ్యం కాదు. ఓడిపోయినప్పుడు మనకు అండగా ఎవరుంటారు అనేదే ముఖ్యం. పార్టీ నుంచి వెళ్లిపోతామని అనేకమంది బెదిరించారు. ఇష్టం లేకుంటే వెళ్లిపోవాలని ఆ నాయకులకు చెప్పా. మాకు ప్రజలు ముఖ్యం నాయకులు కాదు’’ అని పవన్ క్లారిటీ ఇచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments