close
Choose your channels

Pemmasani:టీడీపీకి కంచు కవచంలా నిలబడతాం.. సీఎం జగన్‌కు పెమ్మసాని బహిరంగ సవాల్..

Thursday, April 11, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

టీడీపీకి కంచు కవచంలా నిలబడతాం.. మీ ముని మనవడు కూడా టీడీపీని టచ్ చేయలేరు. గుంటూరుకు నువ్వు రా! నేను సిద్ధం అంటూ సీఎం జగన్‌కు గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్(Pemmasani Chandrashekar) సవాల్ విసిరారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా తాడికొండ నియోజకవర్గ అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్‌తో కలిసి బుధవారం పెమ్మసాని రోడ్ షో నిర్వహించారు. తాడికొండ మండలం దామరపల్లి, పొన్నెకల్లు గ్రామాల్లో ఆయన పర్యటించారు. దారి పొడవున గ్రామస్తులు పూలవర్షంతో స్వాగతం పలకగా.. పలు కూడళ్ళలో ఎక్స్‌కావేటర్ల సహాయంతో భారీ గజమాలతో ప్రజలు తమ గ్రామాల్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వైసీపీకి చెందిన ముప్పై కుటుంబాలు టీడీపీ, బీజేపీ పార్టీలో చేరాయి.

అనంతరం పొన్నెకల్లు ప్రచార ముగింపు సభలో పెమ్మసాని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్ టీడీపీని తక్కువ అంచనా వేశారని.. ఎంతమంది వచ్చినా తెలుగుదేశం పార్టీని టచ్ కూడా చేయలేరని తెలిపారు. 16 నెలలపాటు జైల్లో ఉండి వచ్చిన జగన్‌లో మార్పు వచ్చి ఉంటుందని నమ్మి అప్పట్లో ప్రజలు భావించారని..అందుకే 151 సీట్లతో అధికారంలో కూర్చోబెట్టారు అన్నారు. అయితే కృతజ్ఞత తీర్చుకోవాల్సిన జగన్ ప్రజలపై కక్ష తీర్చుకోవడం మొదలుపెట్టారని మండిపడ్డారు. ప్రజా వేదిక కూల్చివేతతోనే ఆయన తన అరాచక పాలన ప్రారంభించారని విమర్శించారు.

అదే చంద్రబాబు హయాంలో ఆయన ఎంతోమంది నాయకులు, పెద్దల వద్దకు వెళ్లి పరిశ్రమలు, హాస్పిటళ్ళు, రిహాబిలిటేషన్ సెంటర్లు వంటి 120 సంస్థలను తీసుకువచ్చారని చెప్పారు. కానీ ఆ సంస్థలను రద్దు చేసిన జగన్ ఏపీలో నాసిరకం, కల్తీ మద్యాన్ని అభివృద్ధి చేశారని ఎద్దేవా చేశారు. మద్యం కనిపెట్టిన వాళ్లకే అర్థం కాని బ్రాండ్లు తయారుచేసి, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారని ఫైర్ అయ్యారు. రూ. 60లు ఉండే మద్యం బాటిల్ ధరను రూ.200 చేసిన జగన్.. అందులో 70 శాతం వాటాలను తన తాడేపల్లి ప్యాలెస్‌కు తరలిస్తున్నారని ఆరోపించారు.

"మా గుంటూరు ప్రజలకు అభివృద్ధి కావాలి, అరాచకం కాదు. కన్స్ట్రక్షన్ కావాలి, డిస్ట్రక్షన్ కాదు. టిడిపిని ఓడిస్తే ఇక తిరుగులేదని పిచ్చి భ్రమలో ఉన్న జగన్ కు ఒక్కటే చెబుతానున్నాను, టిడిపి – చంద్రబాబు -లోకేష్‌కు మేమంతా కంచు కవచంలా అడ్డం నిలబడతాం. జగన్…. ఆయన తండ్రిగారు, తాతగారే కాదు, ముని మనవడు కూడా మా టిడిపిని టచ్ చేయలేరు. వాళ్లు వీళ్లు కాదు, దమ్ముంటే గుంటూరుకు నువ్వు రా జగన్. నీ క్యాండిడేట్ వెళ్ళిపోతాను అంటున్నారు కదా! మాట మాట్లాడితే అభ్యర్థిని మారుస్తున్నావు కదా! ఇప్పటికి నలుగురిని మార్చారు. ఐదో వాడిగా నువ్వు రా! జగన్… నేను సిద్ధం’ పెమ్మసాని సవాల్ విసిరారు.

ఒక్కసారి ప్రజలంతా టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని గుర్తు చేసుకోండి. మంచి నాయకత్వానికి ఓటేసి అమరావతిని నిలబెట్టుకోవాలి.’ అని తాడికొండ నియోజకవర్గ టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ ప్రజలను ఉద్దేశించి తెలిపారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.