close
Choose your channels

టీఎస్ఎఫ్ డీసీ తొలి ఛైర్మన్ గా రామ్మోహనరావు ప్రమాణ స్వీకారం!

Monday, September 4, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తెలంగాణ రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎఫ్‌డీసీ) తొలి ఛైర్మన్‌గా పూస్కూర్ రామ్మోహన్‌రావు సోమవారం హైదరాబాద్‌లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం తెలుగు చిత్రసీమ అద్భుతమైన విజయాల్ని సాధిస్తున్నది. దేశంలోనే అగ్రగామి పరిశ్రమగా దూసుకుపోతున్నది. విదేశాల్లో కూడా తెలుగు సినిమాలు చక్కటి ఆదరణను సొంత చేసుకుంటున్నాయి. బాహుబలి దారిలోనే పలువురు అగ్ర హీరోల సినిమాలు దేశవ్యాప్తంగా సత్తా చాటడానికి సిద్ధమవుతున్నాయి. ఇలాంటి తరుణంలో హైదరాబాద్‌ను భారతదేశ చలన చిత్ర పరిశ్రమకు ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దాలనే ధృడ సంకల్పంతో మేము ముందుకుపోతున్నాము.

స్టూడియోల నిర్మాణం కోసం హైదరాబాద్ శివార్లలో పెద్ద ఎత్తున స్థలాల్ని కేటాయించాలని నిర్ణయించుకున్నాం. నగరంలో వున్న స్టూడియోలు చిన్నవి వుండటం వల్ల చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. వాటిని అధిగమించే ప్రయత్నంలో భాగంగా శివార్లలో స్టూడియోల నిర్మాణం చేపట్టాలని భావిస్తున్నాం. దీంతో పాటు అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్‌లో ఓ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌ను నెలకొల్పబోతున్నాం. ఇందుకుగాను ఇప్పటికే రెండు ప్రాంతాల్లో 50ఎకరాల భూమిని పరిశీలించాం. ఏ ప్రాంతంలో ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌ను నెలకొల్పాలనే విషయంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్‌గారు తుది నిర్ణయం తీసుకుంటారు. ఇక సినిమా టిక్కట్లను ఆన్‌లైన్‌లో విక్రయించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ ప్రక్రియ పూర్తయితే నిర్ధిష్టమైన టిక్కెట్ రేట్లను నిర్ణయించే అవకాశం కలుగుతుంది. దీంతో పాటు మండలస్థాయిలో కొత్త థియేటర్లను ఏర్పాటు చేయాలనే ఆలోచనతో వున్నాం. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో వాటిని నిర్మించాలనుకుంటున్నాం.

ఆ థియేటర్ల నిర్మాణానికి ముందుకువచ్చే ఔత్సాహికులకు ప్రభుత్వంపరంగా కొన్ని మినహాయింపులు ఇవ్వాలని అనుకుంటున్నాం. దాదాపు వంద మండలాల్లో కొత్త థియేటర్లను నిర్మించాలనే ఆలోచనతో వున్నాం. రాబోవు మూడునెలల్లో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాం. సుదీర్ఘకాలంగా నేను పరిశ్రమలో వున్నాను కాబట్టి ఇక్కడి సమస్యలపై పూర్తి అవగాహన వుంది అన్నారు.ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు వినోద్, వివేక్, ఎంపీ కే. కేశవరావు, ఎంపీ బాల్కసుమన్, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, ప్రముఖ నిర్మాతలు దిల్‌రాజు, బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, అల్లు అరవింద్, ఆదిశేషగిరిరావు, తమ్మారెడ్డి భరద్వాజ, బూరుగుపల్లి శివరామకృష్ణ, బెల్లంకొండ సురేష్, కె.ఎల్.నారాయణ, బెక్కెం వేణుగోపాల్, అల్లాణి శ్రీధర్, సానా యాదిరెడ్డి, దర్శకులు ఎన్.శంకర్, దశరథ్, విజేందర్‌రెడ్డి, నటుడు సుమన్, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు మురళీమోహన్‌రావు, సెక్రటరీ సునీల్ నారంగ్ తదితరులు పాల్గొన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.