Tammineni:రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు.. స్పీకర్ తమ్మినేని సంచలన నిర్ణయం..


Send us your feedback to audioarticles@vaarta.com


ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచి టీడీపీకి మద్దతు తెలిపిన రాంనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి.. టీడీపీ నుంచి గెలిచి వైసీపీకి మద్దతు తెలిపిన కరణం బలరాం, వల్లభనేని వంశీ, మద్దాలి గిరిధర్, వాసుపల్లి గణేష్‌లను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
గతేడాది జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు సందర్భంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు ఓట్లేశారంటూ నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వైసీపీ నుంచి శాసనసభకు ఎన్నికై పార్టీ నిబంధనలు ఉల్లంఘించిన ఎమ్మెల్యేలపై ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం అనర్హత వేటు వేయాలని కోరుతూ వైసీపీ చీఫ్ విప్ ముదునూరు ప్రసాదరాజు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. అలాగే టీడీపీ నుంచి శాసనసభకు ఎన్నికై పార్టీకి దూరంగా ఉంటున్న ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ విప్ డోలా బాల వీరాంజనేయస్వామి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ రెండు పార్టీల ఫిర్యాదులపై విచారణ జరిపిన స్పీకర్ తమ్మినేని.. పలుమార్లు ఎమ్మెల్యేల నుంచి వివరణలు తీసుకున్నారు.
అనంతరం 8 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డట్లు విచారణలో తేల్చారు. దీంతో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. స్పీకర్ ఆదేశాల మేరకు ఏపీ లెజిస్లేచర్ సెక్రటరీ జనరల్ పీపీకే రామాచార్యులు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడినా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. ఈ నిర్ణయంతో కేవలం వారి పదవులు మాత్రమే కోల్పోతారని పేర్కొంటున్నారు. ఏదైనా క్రిమినల్ కేసుల్లో రెండేళ్ల జైలు శిక్ష అనుభవిస్తే మాత్రమే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులు అవుతారని స్పష్టంచేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments