close
Choose your channels

సలహాదారులకు రూ.680కోట్లు.. ఒక్క సజ్జలకే రూ.140కోట్లు: నాదెండ్ల

Thursday, February 1, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సలహాదారులకు రూ.680కోట్లు.. ఒక్క సజ్జలకే రూ.140కోట్లు: నాదెండ్ల

ప్రభుత్వ సలహాదారుల కోసమే వైసీపీ ప్రభుత్వం రూ.680కోట్ల ప్రజాధనం ఖర్చు పెట్టిందని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కోసమే ఏకంగా రూ.140కోట్లు వృథా చేసిందని ఆరోపించారు. అసలు ఈ సలహాదారులు ఎవరు? ఎన్ని సలహాలు ఇచ్చారు? వారికి ఎంత మేర ఖర్చు చేశారు అనే వివరాలపై సీఎం జగన్ అసెంబ్లీ వేదికగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 89 మంది సలహాదారులను ప్రభుత్వం నియమించడం.. వారి అర్హతలను ఎవరికి తెలియకుండా దాచిపెట్టడం వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు.

‘‘సలహదారుల నియామకం విషయంలో హైకోర్టును కూడా ప్రభుత్వం తప్పుదారి పట్టించింది. ప్రభుత్వంలో ఎంతమంది సలహాదారులు ఉన్నది ముఖ్యమంత్రికి కూడా తెలియదు. కొంత మంది సలహాదారులను ముఖ్యమంత్రి కూడా కలవలేదు. దీంతో సీఎం విధానం నచ్చని కొంతమంది ఆ పదవికి రాజీనామా చేశారు.
రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ వీరికి అనవసరంగా నిధులు కేటాయిస్తున్నారని గతంలో హైకోర్టులో పిల్‌ వేశాం. దేని కోసం ఇంతమందిని నియమించారు? ఎలాంటి సలహాలు ఇస్తున్నారు? వాటిని ఎక్కడైనా అమలు చేస్తున్నారా? సలహాదారుల విధానం అనవసరం అని న్యాయస్థానం అభిప్రాయపడింది. సలహాదారుల నియామకానికి సంబంధించి పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది’’ అని తెలిపారు.

"సలహాదారుల నియామకంలో నూతన విధానాన్ని తీసుకొస్తున్నట్లు మార్చి 2023లో హైకోర్టుకు ప్రభుత్వం నివేదిక ఇచ్చింది. అర్హులనే నియమిస్తున్నట్లు పేర్కొంది.

సలహాదారులకు రూ.680కోట్లు.. ఒక్క సజ్జలకే రూ.140కోట్లు: నాదెండ్ల

కనీసం ఒక్క విలేకరుల సమావేశం కూడా నిర్వహించని ముఖ్యమంత్రి.. సలహాదారుల నుంచి ఏం సలహాలు తీసుకున్నారో ప్రజలకు తెలియాలి. వారు ఇచ్చే సలహాలను సీఎం నిజంగా తీసుకుని అమలు చేస్తున్నారా.?. ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు కల్పించకుండా ఐబీ సిలబస్ అమలు అంటున్నారు. ఏ సలహాదారు చెబితే ఈ విద్యా విధానంలో మార్పు తెచ్చారు. ఈ సలహాదారుల వల్ల ప్రజలకు, రాష్ట్రానికి జరిగిన మేలు ఏంటో ప్రభుత్వం చెప్పగలదా?" అని ప్రశ్నించారు.

"సీఎంతో రోజూ మాట్లాడేది కేవలం ఇద్దరు సలహాదారులు మాత్రమే. రూ.140 కోట్లు ఒక్క సజ్జల కోసం ఖర్చు చేస్తే ఏమనుకోవాలి. ప్రభుత్వ సొమ్మును తీసుకొంటూ.. ప్రతిపక్షాలను సజ్జల విమర్శిస్తారా? జగన్‌కు చిత్తశుద్ది ఉంటే.. ఏ పని కోసం సలహాదారులను అమలు చేశారు. వారు ఇచ్చిన సలహాల వల్ల ఏ అంశాలలో మార్పు జరిగాయో పూర్తి వివరాలతో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. సలహాదారుల కోసం 680 కోట్లు ఖర్చు పెడతారా? ఏ బడ్జెట్ కింద ఈ డబ్బు ఖర్చు పెట్టారో శాసనసభ సమావేశాల్లో చెప్పాలి" అని నిలదీశారు.

ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌ను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా 80 కోట్ల మందికి ఉచిత రేషన్‌ ఇవ్వడం గొప్ప విషయమని.. దీన్ని 2029 వరకు పొడిగించడం అభినందనీయమని కొనియాడారు. పర్యటక రంగాన్ని ప్రోత్సహించే విధంగా కేంద్రం సహకరిస్తోందని.. దీంతో అత్యంత తీర ప్రాంతం ఉన్న ఏపీలో పర్యాటక రంగంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరారు. అలాగే ముఖ్య పట్టణాలకు మెట్రో విస్తరించాలని నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతించారు. వైజాగ్‌తో పాటు విజయవాడ-గుంటూరు-మంగళగిరి-తెనాలి ప్రాంతాల్లో మెట్రో ఏర్పాటు చేస్తే గ్రోత్ కారిడార్లగా అభివృద్ధి చెందుతాయన్నారు. దీంతో యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. సౌర విద్యుత్తును ప్రోత్సహించేలా 300 యూనిట్ల కరెంటును ఉచితంగా అందించే పథకం అభినందనీయమని నాదెండ్ల కొనియాడారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Related Videos