close
Choose your channels

Volunteers:వాలంటీర్లే ప్రధానాంశంగా ఎన్నికల ప్రచారం.. ఏ పార్టీకి లాభం.. నష్టం..?

Wednesday, April 10, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఏపీలో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకుంది. ముఖ్యంగా వాలంటీర్ల చుట్టూ రాజకీయం నడుస్తోంది. వారిని ప్రసన్నం చేసుకునేందుకు అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ కూటమి ప్రణాళికలు రచిస్తున్నాయి. వైసీపీ నేతలు అయితే ఏకంగా వాలంటీర్లు తమ పార్టీ కార్యకర్తలు అని.. తమ పేటెంట్ అని బహిరంగంగానే చెబుతున్నారు. ఏకంగా సీఎం జగన్ కూడా వాలంటీర్లే తన సైన్యం అని వ్యాఖ్యానించారంటే వారి మీద ఎంత నమ్మకం పెట్టుకున్నారే అర్థం చేసుకోవచ్చు. ఇదే ఇప్పుడు వైసీపీకి మైనస్‌గా మారింది.

వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చి సొంత క్యాడర్‌ను పట్టించుకోలేదనే విమర్శలు జగన్ మీద ఉన్నాయి. వాలంటీర్లు వచ్చిన దగ్గరి నుంచి పార్టీ నేతలతో పాటు ఎమ్మెల్యేలకు పనిలేకుండా పోయిందని.. ప్రజల్లో మమేకం కాలేకపోయామనే భావన వారిలో ఉంది. అయితే జగన్ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వంలో జరిగిన మంచిని ప్రజలకు చెప్పాలని వాలంటీర్లకు దిశానిర్దేశం చేస్తూ వచ్చారు. అయితే ఎన్నికల విధుల్లో వాలంటీర్లను తప్పించేలా చేయడంలో వైసీపీ నేతల తప్పిదం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

సీఎం జగన్ నుంచి వైసీపీ పెద్దల వరకు బహిరంగంగానే వాలంటీర్లు తమ పార్టీ కార్యకర్తలు అని స్టేట్‌మెంట్లు ఇచ్చారు. దీంతో వారి వ్యాఖ్యాలపై ప్రతిపక్షాలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదుచేశాయి. దీంతో ఈసీ వాలంటీర్లను ఎన్నికల విధుల నుంచి తప్పించింది. అంతేకాకుండా వాలంటీర్ల చేత పింఛన్ పంపిణీ కూడా చేయవద్దని ఆదేశించింది. అయితే దీనికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం తరపున ఏర్పాటు చేయకపోవడంతో వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు వాలంటీర్ల వ్యవస్థ రద్దయిపోయిందన్నట్లుగా జగన్ మాట్లాడుతున్నారు. తాను మళ్లీ సీఎం అవగానే మొదటి సంతకం వాలంటీర్ల వ్యవస్థ మీద పెడతానని చెప్పుకొస్తున్నారు.

దీంతో ప్రతిపక్షాలు జగన్ వ్యాఖ్యలను అస్త్రంగా చేసుకుని విమర్శలకు దిగుతున్నాయి. వాలంటీర్ల గడువు మే 31వ తేదీతో ముగుస్తుందని వీరి ఉద్యోగాలు శాశ్వతం కాదని.. అందుకే తన తొలి సంతకం వాలంటీర్ వ్యవస్థపై సీఎం అంటున్నారని ప్రభుత్వంపై రివర్స్ ఎటాక్ చేస్తున్నాయి. దీంతో వైసీపీ డిఫెన్స్‌లో పడిపోయింది. అంతేకాకుండా కొన్ని చోట్ల వాలంటీర్ల చేత రాజీనామాలకు పట్టుబడుతున్నారు వైసీపీ నేతలు. రాజీనామా చేసి తమ కోసం ప్రచారం చేయాలని ఆదేశిస్తున్నారు. అయితే వారి ఆదేశాలను వాలంటీర్లు ఎక్కడా పట్టించుకోవడం లేదు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రెండున్నర లక్షల మంది వాలంటీర్లలో కేవలం ఐదు వేల మంది మాత్రమే ఇప్పటివరకు రాజీనామాలు చేసి ఉంటారని అంచనా వేస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం మళ్లీ రాకపోతే తమ భవిష్యత్ ఏంటనే ఆందోళణనతో చాలా మంది వాలంటీర్లు రాజీనామా చేసేందుకు వెనకడుగు వేస్తున్నారు. ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లు నెలకు రూ.50 వేల వరకూ సంపాదించుకునేలా ఏర్పాట్లు చేస్తామని ఇప్పటికే హామీ ఇచ్చారు. తాజాగా ఉగాది పర్వదినాన వాలంటీర్ల గౌరవ వేతనం రూ.5వేల నుంచి రూ.10వేలు చేస్తామని ప్రకటించారు. అయితే వాలంటీర్లు రాజకీయాలు చేయకూడదని.. వైసీపీ నేతల ప్రచారంలో పాల్గొనకూడదనే షరతు విధించారు. అలాంటి వాలంటీర్లను పక్కన పెడతామని తెలిపారు.

అయితే చంద్రబాబు ప్రకనటపై వైసీపీ తనదైన శైలిలో స్పందించింది. "వాలంటీర్ వ్యవస్థను గుర్తించినందుకు చంద్రబాబు, పవన్, మోదీకి థ్యాంక్స్. ఇది జగన్ పాలనా నమూనా విజయానికి నిదర్శనం. ఈ వాలంటీర్ వ్యవస్థను విపక్షాలు కూడా ఆదరించి పాటించేలా చేసింది. మీరు చింతించకండి. జూన్ 4వ తేదీ తర్వాత జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి మళ్లీ ఆ వ్యవస్థను తిరిగి తీసుకువస్తారు" అని ట్వీట్ చేసింది. కానీ మళ్లీ తిరిగి తీసుకువస్తారు అని ప్రకటించడంపై టీడీపీ కూటమి నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఆ వ్యవస్థ ఉంది కదా.. అంటే మీ రాజకీయ ప్రయోజనాల కోసం కేవలం ఆ వ్యవస్థను నాలుగేళ్లకు మాత్రమే తీసుకొచ్చారా అని నిలదీస్తున్నారు.

మొత్తానికి రాష్ట్ర రాజకీయాలు వాలంటీర్లు చుట్టూనే తిరుగుతున్నాయి. ఇటు వైసీపీ నేతలు ఏమో వారి చేత బలవంతంగా రాజీనామాలు చేయిస్తుంటే.. అటు చంద్రబాబు ఏమో వాలంటీర్ల జీతం పెంచుతామని బంపరాఫర్‌లు ప్రకటిస్తున్నారు. మరి వాలంటీర్లు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారో తెలియాలంటే జూన్ 4వ తేదీ వరకు ఆగాల్సిందే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.