close
Choose your channels

CM Revanth Reddy:చచ్చిన కేసీఆర్ పామును ఎవరైనా చంపుతారా..? సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు..

Wednesday, February 14, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యుల మధ్య మరోసారి వాడివేడి వాదనలు సాగాయి. ప్రాజెక్టులపై చర్చ సందర్భంగా ఛలో నల్లగొండ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అభ్యంతర చెప్పారు. ఓ సీఎం పట్ల మాజీ సీఎం వాడిన భాష సరికాదంటూ మండిపడ్డారు. దమ్ముంటే కాళేశ్వరం ప్రాజెక్టుపై సభకు వచ్చి చర్చించాలని కేసీఆర్‌కు సవాల్ విసిరారు.

"ఓ సీఎంను పట్టుకుని 'ఏం పీకనీకి పోయారా.? అని అంటారా..? ఇదేనా తెలంగాణ సంప్రదాయం.. ఇది పద్ధతా..? కేసీఆర్ నన్ను చంపుతారా అంటుండు.. ఎవరికి అవసరం.. బొక్కబోర్లా పడ్డ బీఆర్ఎస్ నేతలకు బుద్ధి రాలేదు.. కేసీఆర్ అనే పాము మొన్నటి ఎన్నికల్లోనే చచ్చిపోయింది.. చచ్చిన పామును చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది. ఇప్పటికే తెలంగాణ ప్రజలు కేసీఆర్ ఫ్యాంట్ ఊడదీశారు. ఇప్పుడు చొక్కా లాగుతారు. మేడిగడ్డ, కాళేశ్వరంపై చర్చకు సిద్ధంగా ఉన్నాం. మేడిగడ్డలో కూలింది రెండు పిల్లర్లే అయితే.. వాటి మీదైనా మాట్లాడేందుకు కేసీఆర్ సభకు రావాలి. గురువారం సాయంత్రం వరకైనా కేసీఆర్ సభకు వస్తే చర్చిద్దాం. అవసరమైతే సాగునీటి ప్రాజెక్టులపైనా శ్వేతపత్రం విడుదల చేస్తాం. ప్రతిపక్ష నాయకుడిని సభకు రమ్మనండి. అవినీతి బయటపడుతుందనే సభకు రాకుండా పారిపోయారు" అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

"తెలంగాణ సమాజం పట్ల, రైతుల పట్ల గౌరవం ఉంటే ప్రధాన ప్రతిపక్షం మేడిగడ్డకు వచ్చేది. పదే పదే బీఆర్‌ఎస్ నేతలు భాష గురించి మాట్లాడుతున్నారు. మాజీ సీఎం నల్లగొండలో మాట్లాడిన భాషపై చర్చిద్దామా?. మేడిగడ్డ కుంగిపోతే.. అందులో నీళ్లు నింపడానికి అవకాశం ఉంటదా?, కడియం శ్రీహరి, హరీష్ రావులకే పెత్తనం ఇస్తాం.. నీళ్లు నింపి చూపించండి. చర్చకు సిద్ధమైతే మీ సభాపక్ష నేతను అసెంబ్లీకి రమ్మనండి. కాళేశ్వరంపై, నదీ జలాలపై చర్చకు మేం సిద్ధం"అంటూ ఛాలెంజ్ చేశారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఆయన భాష సరికాదంటూ సీఎం తీరును నిరసిస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. అయితే, కృష్ణా, గోదావరి జలాలపై మాట్లాడేందుకు బీఆర్ఎస్‌ సభ్యులకు ఆసక్తి లేదని.. అందుకే సభ నుంచి వెళ్లిపోయారంటూ కాంగ్రెస్ సభ్యులు ఎద్దేవా చేశారు.

అంతకుముందు సభ ప్రారంభంకాగానే మాజీ మంత్రి కడియం శ్రీహరి మట్లాడుతూ "రాష్ట్ర ప్రభుత్వ చిహ్నంను మార్చాలనే ఆలోచన సరైనది కాదు. కేసీఆర్ ఆనవాళ్లను ఎవరూ చెరపలేరు. కొత్త సెక్రటేరియట్, అంబేద్కర్ విగ్రహం ఇలా ఎదైనా కేసీఆర్ సృష్టించినవే..వీటిని చెరిపేయడం ఎవరి వల్ల కాదు. కాకతీయ రాజులను గౌరవించండి.. కాకతీయ రాజుల వల్లే చెరువులు, నీటిపారుదల రంగం ఇంకా చెక్కుచెదరకుండా ఉంది" అన్నారు. అనంతరం కోమటిరెడ్డి రాజోగోపాల్ రెడ్డి కలుగజేసుకుని మాట్లాడుతూ బీఆర్ఎస్ నేతలు ఇంకా అధికారంలో ఉన్నామనే భ్రమలోనే ఉన్నారు. మీరు ఎన్ని కుట్రలు పన్నినా జన్మలో అధికారంలోకి రారని దుయ్యబట్టారు. మొత్తానికి మరోసారి తెలంగాణ అసెంబ్లీ దద్దరిల్లింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.