close
Choose your channels

Jogaiah:మిమ్మల్ని కాపాడుకోవడానికి సలహాలు ఇస్తూనే ఉంటా.. పవన్‌కు జోగయ్య మరో లేఖ..

Friday, March 1, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఏపీ రాజకీయాలు రోజురోజుకు హాట్‌హాట్‌గా సాగుతున్నాయి. తనకు సలహాలు ఇవ్వొద్దని జెండా సభలో పవన్ కల్యాణ్‌ స్పష్టం చేసినా.. కాపు సంక్షేమ నేత హరిరామ జోగయ్య మాత్రం తాను లేఖలు రాస్తానే ఉంటానంటూ మరో బహిరంగ లేఖ రాశారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఎత్తుల నుంచి పవన్‌ను కాపాడేందుకు ఎన్ని లేఖలైనా రాస్తానంటూ క్లారిటీ ఇచ్చారు. మీకు నచ్చినా లేకున్నా మిమ్మల్ని కాపాడుకోవడం తన విధి అన్నారు.

" జనసేన బాగు కోరి నేను ఇచ్చిన సలహాలు మీకు నచ్చినట్లు లేదు. బహిరంగ సభలో నాకు సలహాలు ఇవ్వనవసరం లేదు అంటూ నా పేరు పెట్టి మీరు అనకపోయినా ఎల్లో మీడియా ప్రచారం చేస్తోన్న వార్తలు మాత్రం నన్నే అన్నట్లు అనిపిస్తోంది. మీకు, నాకు తగువు పెట్టేలా ఎల్లో మీడియా ప్రయత్నిస్తుంది. రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలని నేను మీ కూటమికి సలహాలు ఇస్తున్నాను. అంతేగాని నాకు వ్యక్తిగత ప్రయోజనాలు ఏమి లేవు. నేను వైసీపీ కోవర్ట్‌ అయితే సీఎం జగన్ మోహన్ రెడ్డి మీద ఎందుకు కేసులు వేస్తాను. మీ మీద ప్యాకేజీ స్టార్ అని ముద్ర వేస్తుంటే చంద్రబాబు, లోకేష్ ఎందుకు ఖండించడం లేదు.

మీకు తక్కువ సీట్లు ఇచ్చి లోకేష్‌ని సీఎంగా చేసి నిధానంగా మిమ్మల్ని దూరం చేస్తారనే అనుమానం జనసైనికుల్లో ఉంది. ప్రజారాజ్యం పెట్టినప్పుడు నేను ఉన్న పదవిని కూడా వదిలేసుకుని మీ అన్న చిరంజీవి వెంట నడిచాను. బిజెపి కూడా మీతో ఉంటే బలంగా ఉంటుందని నమ్మాను కాబట్టే జనసేన తెలుగుదేశం పార్టీతోపాటు పొత్తులో బిజెపి ఉండాలని బలంగా కోరుకున్నాను. చంద్రబాబు జిత్తుల మారి తెలివితేటల నుంచి మిమ్మల్ని రక్షించేందుకు జనసైనికులు తరఫున లేఖలు రాస్తున్నాను. టిడిపితో పొత్తులో భాగంగా జనసేనకు సముచిత స్థానం కల్పించాలని కనీసం 40 సీట్లు అన్న వస్తే మీ గౌరవం నిలబడుతుందని లేఖలు రాశాను.

మీ హోదాకు తగ్గట్టుగా మీకు సముచిత స్థానం కల్పించాలనేది నా కోరిక. ఎల్లో మీడియా ద్వారా చంద్రబాబు మీకు నాకు మధ్య దూరం పెంచడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రంలో కాపులతోపాటు బీసీలు ఎస్సీలు అన్ని వర్గాల ప్రజలు మీరు సీఎం అయితే బాగుంటుందని భావిస్తున్నారు. కనీసం రెండున్నర సంవత్సరాలైనా మీరు సీఎం గా ఉంటే నీతివంతమైన పరిపాలన అందిస్తారని ప్రజలు కోరుకుంటున్నారు. మీ తరఫున జన సైనికులు అభిప్రాయాలను లేఖల రూపంలో తెలియజేస్తున్నాను. మీకు ఇష్టం లేకపోయినా మీ మంచి కోరేవాడిగా సలహాలు రూపంలో లేఖలు రాస్తూనే ఉంటాను.

జనసేన లేకుండా తెలుగుదేశం నెగ్గటం అనేది ఇంపాజుబుల్. అది చంద్రబాబుకి తెలియంది కాదు. అందుకే మీతో జతకట్టాడు. వెన్నుపోటు రాజకీయాలకు అలవాటు పడిన చంద్రబాబు ఎన్నికలకు తర్వాతనైనా మీకు అధికారంలో, సముచితమైన స్థానం ఇస్తాడని ముఖ్యమంత్రి పదవి చేపట్టటంలో భాగస్వామిని చేస్తాడని ఎవరు నమ్ముతారు. ఎన్నికలైన తర్వాత జనసేనను క్రమేపీ నిర్వీర్యం చేసి తన కొడుకు లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేస్తాడు అనే భయం జనసైనికులు అందరిలో ఉన్నమాట నిజం.

ఎన్నికలు ముందే మీకు అధికారంలో రావటంతోపాటు, మీ స్థానం ఏమిటో తేల్చాలని జనసైనికుల తరపున నేను డిమాండు చేయటంలో తప్పేమిటి? సముచితమైన నా సలహాలను వక్రీకరిస్తూ వై.ఎస్.ఆర్. కోవర్టుగా నాకు ముద్ర వేయటానికి ప్రయత్నం చేస్తున్న ఈ ఎల్లో మీడియాను కాని, జనసేన పార్టీలోని కొంతమంది మీ సలహాదారులను కాని ఏమనాలి. వారు తెలుగుదేశం కోవర్టులుగా చెప్పవచ్చా. జరుగుతున్న ఈ పరిణామాలపై మిశ్రులెవరో, శత్రువులెవరో తెలుసుకుని మీరు ప్రవర్తించటం, జనసేన మంచికోసం ఎంతైనా మంచిది.

మీకు ఇష్టమైనా లేకపోయినా మీ వెంటనే ఉండి మిమ్మల్ని కావాడుకోవటం నా విధిగా భావిస్తున్నాను. నేను చచ్చేవరకు నా ప్రవర్తన ఇలాగే ఉంటుందని మీకు తెలియపరుస్తున్నాను. జనసేన తెలుగుదేశం బిజెపి కూటమి ఎన్నికలో కలిసే పోటీ చేయాలనేది నా ఆకాంక్ష. తద్వారా వై.ఎస్.ఆర్. పార్టీ విముక్తి కలుగచేయాలనే యజ్ఞంలో జనసైనికులు మీతోనే ఉంటారు. అందులో మీరు సందేహపడాల్సిన పని లేదు.

నీతివంతమైన మీలాంటి వారు మాత్రమే ముఖ్యమంత్రి అవ్వాలని నాలాంటి వారు కోరుకుంటున్నారు. దోచుకో దాచుకో పరిపాలన అందిస్తున్న వై.ఎస్.ఆర్. పార్టీ పరిపాలనకు ముగింపు పలకాలనే మీ లక్ష్యసాధనకు మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. అయితే అధికారంలో మీకు సముచితమైన స్థానం లభించేవరకు మా పోరాటం ఇలాగనే కొనసాగుతుందని తెలియపరచాల్సి వస్తుంది. మీరు పట్టించుకున్న పట్టించుకోకపోయినా మీ మీద అభిమానంతో మీకు సలహాలు ఇస్తూనే ఉంటాను" అని లేఖలో జోగయ్య వెల్లడించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.