వైసీపీ 5వ జాబితా విడుదల.. నరసరావుపేట ఎంపీ అభ్యర్థి ఎవరంటే..?
Send us your feedback to audioarticles@vaarta.com
ఇటీవల ఎన్నికల శంఖారావం పూరించిన సీఎం జగన్.. అభ్యర్థుల కసరత్తును ముమ్మరం చేశారు. ఇప్పటికే నాలుగు జాబితాల్లో 58 ఎమ్మెల్యే, 10 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన వైసీపీ పెద్దలు.. తాజాగా 5వ జాబితాను ప్రకటించారు.ఈ జాబితాలో నాలుగు ఎంపీ, 3 నియోజకవర్గాలకు ఎమ్మెల్యే స్థానాలను వెల్లడించారు. మంత్రి బొత్స సత్యనారాయణ ఈ మేరకు లిస్ట్‌ను ప్రకటించారు.
ఈ జాబితాను ఓసారి పరిశీలిస్తే నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్‌ను నియమించారు. ఇక మచిలీపట్నం ఎంపీ బాలశౌరి పార్టీ మారడంతో ఈ స్థానం నుంచి అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్‌బాబును పార్లమెంట్ ఇంచార్జ్‌గా ప్రకటించారు. తిరుపతి ఎంపీ అభ్యర్థిగా తిరిగి గురుమూర్తినే నియమించారు. ఇంతకుముందు జాబితాలో ఈయనను సత్యవేడు ఎమ్మెల్యే స్థానానికి మార్చి తిరుపతి ఎంపీ స్థానానికి కోనేటి ఆదిమూలంను అనౌన్స్ చేశారు. అయితే ఆదిమూలం పార్టీపై ధిక్కార స్వరం వినిపించి టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇక కాకినాడ ఎంపీ అభ్యర్థిగా చలమలశెట్టి సునీల్‌కు ఛాన్స్ ఇచ్చారు. ఈయన 2014 ఎన్నికల్లో కాకినాడ ఎంపీగా వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
ఇక ఎమ్మెల్యే స్థానాల విషయానికొస్తే అరకు వ్యాలీలో గొట్టేటి మాధవి స్థానంలో రేగా మత్స్యలింగంకు అవకాశం కల్పించారు. సత్యవేడు అసెంబ్లీ సీటుకు నూకతోటి రాజేష్.. అవనిగడ్డ స్థానానికి డాక్టర్. సింహాద్రి చంద్రశేఖరరావును నియమించారు. మొత్తంగా ఇప్పటివరకు ఐదు జాబితాలు కలిపి 14 ఎంపీలు, 61 ఎమ్మెల్యే స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్లైంది.
ఇదిలా ఉంటే గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతలను ఎంపీ విజయసాయిరెడ్డికి, ఒంగోలు పార్లమెంట్, సంతనూతలపాడు, కందుకూరు, కొండేపి స్థానాలకు సమన్వయకర్తగా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని నియమించారు. దీంతో ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి ఖారారు అయినట్లేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు సీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈయనను ప్రత్తిపాడు నియోజకవర్గ ఇంచార్జ్‌గా నియమించే అవకాశాలున్నాయి. 2014లో టీడీపీ తరపును గెలిచిన రావెల.. మంత్రిగా కూడా పనిచేశారు. 2018లో జనసేన కండువా కప్పుకున్నారు. అనంతరం బీజేపీలో జాయిన్ అయ్యారు. 2022లో కాషాయం పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎప్ పార్టీలో చేరారు. ఇలా అన్ని ప్రధాన పార్టీల్లో రావెల చేరడం విశేషం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments