close
Choose your channels

YS Sharmila: పార్టీ బలోపేతమే లక్ష్యం.. జిల్లాల పర్యటనకు వైయస్ షర్మిల శ్రీకారం..

Monday, January 22, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

పార్టీ బలోపేతమే లక్ష్యం.. జిల్లాల పర్యటనకు వైయస్ షర్మిల శ్రీకారం..

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన వైయస్ షర్మిల(YS Sharmila) పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎన్నికలకు ఎక్కువ సమయం లేకపోవడంతో రేపటి(మంగళవారం) నుంచి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం నుంచి కడప జిల్లాలోని ఇడుపులపాయ వరకు పర్యటించనున్నారు. ఈ మేరకు ఆమె పర్యటన షెడ్యూల్ ఖరారైంది.

ఈ నెల 23వ తేదీన శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం నుంచి షర్మిల పర్యటన ప్రారంభం కానుంది. ఆ రోజున పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో పర్యటిస్తారు. 24వ తేదీన విశాఖపట్టణం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలు.. 25వ తేదీన కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాలు.. 26వ తేదీన తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లా.. 27వ తేదీన కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాలు.. 28వ తేదీన బాపట్ల, ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు.. 29వ తేదీన తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలు.. 30వ తేదీన శ్రీ సత్య సాయి, అనంతపురం, కర్నూలు జిల్లాలు.. 31వ తేదీన నంద్యాల, వైఎస్ఆర్ కడప జిల్లాలో షర్మిల పర్యటన కొనసాగుతుంది. ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించి పర్యటన ముగించనున్నారు.

ఈ పర్యటనలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేలా కార్యాచరణ రూపొందించనున్నారు. స్థానిక నేతలతో సంప్రదింపులు జరుపుతారు. క్షేత్రస్థాయిలో అందరినీ కలుపుకుని వెళ్లనున్నారు. అలాగే ఇతర పార్టీల్లో అసంతృప్తులుగా కీలక నేతలను కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తారు. కొత్త, పాత తరం నేతల కలయికతో పార్టీని బలోపేతం చేయాలని ఆమె భావిస్తున్నారు. రాష్ట్ర విభజనతో నష్టపోయిన రాష్ట్రానికి ప్రత్యేక డిక్లరేషన్ ప్రకటించనున్నారు. ఈ పర్యటనకు కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.

పార్టీ బలోపేతమే లక్ష్యం.. జిల్లాల పర్యటనకు వైయస్ షర్మిల శ్రీకారం..

కాగా ఏపీసీసీ చీఫ్‌గా షర్మిలను ప్రకటించగానే పాతాళంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ క్యాడర్‌లో కొంత ఊపు వచ్చింది. రాజకీయాల్లో సైలెంట్ అయిన సీనియర్ నేతలందరూ మళ్లీ యాక్టివ్ అయ్యారు. వైఎస్సార్ వారసురాలిగా షర్మిలకు అండగా ఉండేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఆమె ప్రమాణస్వీకార కార్యక్రమానికి మాజీ మంత్రి రఘువీరా రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం, మాజీ పీసీసీ చీఫ్ శైలజానాథ్, సీనియర్ నేతలు కేవీపీ రామచంద్రరావు, తులసిరెడ్డి, గిడుగు రుద్రరాజు, సుంకర పద్మ లాంటి నేతలు విచ్చేశారు.

అంతకుముందు కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించేందుకు గన్నవరం నుంచి విజయవాడ వెళ్తున్న ఆమె కాన్వాయ్‌ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ప్రభుత్వం తీరుపై షర్మిల తీవ్రంగా మండిపడ్డారు. ఎట్టకేలకు పోలీసుల ఆంక్షల మధ్యనే విజయవాడలోని కాంగ్రెస్ కార్యాలయానికి చేరుకున్న షర్మిల పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ సొంత అన్న సీఎం జగన్‌ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీకి మద్ధతు ఎందుకు ఇస్తున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వనుందుకా..? రాజధానికి నిధులు ఇవ్వనందుకా..? క్రైస్తవులపై దాడులు చేస్తునందుకా..? అంటూ నిలదీశారు.

రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదు కానీ మైనింగ్, లిక్కర్, ఇసుక మాఫియాలు తయారయ్యాని విరుచుకుపడ్డారు. ఏపీలో ఒక్క మెట్రో కట్టలేదని, పెద్ద పరిశ్రమలు రాలేదని, ఉద్యోగులకు ఒకటో తేదీ జీతాలు ఇవ్వడం లేదని, రోడ్లు బాగాలేవని, ఒక్క రాజధాని కూడా కట్టలేదని విమర్శల వర్షం కురిపంచారు. తాను ఎవరూ వదిలిన బాణాన్ని కాదంటూ వైసీపీ నేతల విమర్శలకు కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. అటు మాజీ సీఎం చంద్రబాబుపైనా ఆమె రెచ్చిపోయారు. మొత్తానికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పునరుత్తేజం తీసుకొచ్చేలా షర్మిల తొలి ప్రసంగం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.