Lokesh:లోకేష్ పాదయాత్రలో మరో మైలురాయి.. పాల్గొన్న బాలయ్య కొడుకు..
Send us your feedback to audioarticles@vaarta.com
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర మరో మైలురాయికి చేరుకుంది. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా తుని మండలంలో సాగుతున్న పాదయాత్ర తేటిగుండ వద్దకు వచ్చేసరికి 3000 కిలోమీటర్లకు చేరుకుంది. దీంతో రాజులకొత్తూరులో 3వేల కిలోమీటర్ల పైలాన్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆయన సతీమణి బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్, నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ, చిన్న అల్లుడు భరత్, ఇతర టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ ట్వీట్ చేశారు.
'వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కల్పించిన అన్ని అడ్డంకులను అధిగమిస్తూ ప్రజలే సైన్యంగా యువగళం పాదయాత్ర 3000 కి.మీ మైలురాయికి చేరింది. తుని నియోజకవర్గం తేటగుంట పంచాయతీలో ఈ మజిలీకి గుర్తుగా వైకాపా సర్కారుమూసేసిన పేదల ఆకలి తీర్చే అన్నాక్యాంటీన్లు మళ్లీ ప్రారంభిస్తామని హామీ ఇస్తూ శిలాఫలకం ఆవిష్కరించాను'అని తెలిపారు. మరోవైపు టీడీపీ నేతలు, అభిమానులు కూడా లోకేష్‌కు అభినందనలు తెలియజేస్తున్నారు.
ఇక ఈ ఏడాది జనవరి 27న ఉమ్మడి చిత్తూరు జిల్లా కుప్పంలో లోకేశ్ పాదయాత్ర మొదలుపెట్టారు. రాయలసీమలో పాదయాత్ర పూర్తి చేసి కోస్తా ప్రాంతంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు వరకు కొనసాగింది. అయితే స్కిల్ డెవలెప్‌మెంట్ కేసులో అనూహ్యంగా చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేయడంతో పాదయాత్రకు విరామం ప్రకటించిన సంగతి తెలిసిందే. తిరిగి నవంబర్ 27న పాదయాత్రను తిరిగి ప్రారంభించారు. ఇప్పటివరకు 10 జిల్లాల మీదుగా 92 నియోజకవర్గాల్లో ఈ యాత్ర సాగింది. ఇక ఈనెల 20న భోగాపురం మండలం పోలిపల్లిల్లో పాదయాత్ర ముగియనుంది. అక్కడ భారీ బహిరంగ సభ ఏర్పాటుచేయనున్నారు. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ కూడా పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రగించనున్నారు.
కాగా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు వైఎస్ జగన్, షర్మిల మాత్రమే 3వేల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసి రికార్డు సృష్టించారు. ఇప్పుడు లోకేష్ కూడా వారి సరసన చేరారు. ఆ తర్వాత చంద్రబాబు 2012లో 2,817 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments