close
Choose your channels

టీడీపీకి భారీ షాక్.. వైసీపీలో చేరిన కీలకనేత

Saturday, February 16, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

టీడీపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు టీడీపీకి టాటా చెప్పి వైసీపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. తాజాగా కర్నూలు జిల్లాపై దృష్టి సారించిన వైసీపీ అధిష్టానం అసంతృప్తితో ఉన్న నేతలకు కండువా కప్పేందుకు సిద్ధమైంది. ముఖ్యంగా ఎవరైతే వైసీపీ తరఫున గెలిచి టీడీపీలోకి జంప్ అయ్యారో ఆయా నియోజకవర్గాల్లో అధిష్టానం కన్నేసింది. కర్నూలు జిల్లాలో కీలక నియోజకవర్గమైన ఆళ్లగడ్డలో భూమా అఖిల ప్రియకు షాక్ తగిలింది. టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్‌‌గా పనిచేసిన ఇరిగెల రాంపుల్లారెడ్డి టీడీపీకి టాటా చెప్పి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కండువా కప్పుకున్నారు.

శనివారం మధ్యాహ్నం ఆళ్లగడ్డ నుంచి అనుచరులు, ముఖ్య కార్యకర్తలతో కలిసి లోటస్‌‌పాండ్‌‌కు వెళ్లిన ఆయన జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆళ్లగడ్డ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధిలో వెనుకబడిందని, అవినీతిని అంతమొందించేందుకు, అవినీతిపరులను భరతం పట్టేందుకు టీడీపీ వీడినట్లు తెలిపారు.

అరాచక పాలనను భరించలేక...

"టీడీపీ అరాచక పాలనను భరించలేక.. ఎలాంటి అభివృద్ధి లేనటువంటి టీడీపీని వీడాను. ప్రజల అభివృద్ధి కోసం సమ సమాజ స్థాపనకు ఇవాళ వైఎస్‌ జగన్‌ చేస్తున్న పోరాటంలో మేం కూడా భాగస్వాములమై రాబోయే ఎన్నికల్లో వైసీపీని అత్యధిక మెజారిటీతో గెలిపించి జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకుంటాం. వైసీపీలో ఒక సైనికుడిలాగా పని చేస్తాం. ఆళ్లగడ్డలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు" అని ఇరిగెల చెప్పుకొచ్చారు.

అఖిల విఫలమైంది..

"మంత్రిగా అఖిలప్రియకు అవకాశం ఇచ్చినా ఆమె విఫలమైంది. నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి. తెలుగు గంగా కాల్వను అధునీకరించేందుకు ఈ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నియోజకవర్గంలో విద్య, వైద్యం అందడం లేదు. ఆళ్లగడ్డ మున్సిపాలిటీలో అభివృద్ధి జరగడం లేదు. అవినీతిని అంతమొందించేందుకు జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరాము. పార్టీలో నాకు ఎలాంటి బాధ్యతలు ఇచ్చినా శిరసావశిస్తూ వైసీపీ బలోపేతానికి కృషి చేస్తాము. గంగుల కుటుంబంతో భేదాభిప్రాయాలున్నా శతృత్వం లేదు. జగన్ ఆదేశానుసారం గంగుల కుటుంబంతో కలిసి పనిచేస్తాను" అని ఇరిగెల మీడియాకు వివరించారు.

మొత్తానికి చూస్తే.. ఇరిగెల టీడీపీని వీడటం భూమా కుటుంబానికి ఎదురుదెబ్బేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా అఖిల వైసీపీలో ఉన్నప్పుడు ఇరిగెల నియోజకవర్గ ఇంచార్జ్‌గా ఉంటూ కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు ఆయన టీడీపీని వీడటంతో కేడర్ మొత్తం ఆయన వెంటే నడిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరోవైపు భూమా ఫ్యామిలీకి ఆప్తుడిగా ఉన్న ఏవీ సుబ్బారెడ్డికి- మంత్రి అఖిల ప్రియకు పచ్చగడ్డేస్తే భగ్గుమనేంతగా పరిస్థితులున్నాయి. ఆయన కూడా నంద్యాల లేదా ఆళ్లగడ్డ టికెట్ ఇవ్వాలని సీఎం చంద్రబాబును గట్టిగా పట్టుబట్టారు. అయితే ఇలాంటి సమయంలో ఇరిగెల తనకు సపోర్టుగా ఉంటారనుకుంటున్న అఖిలకు ఊహించని షాక్ తగిలినట్లైంది. ఈ వ్యవహారాలపై భూమా అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే మరి

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.