close
Choose your channels

వైఎస్ కుటుంబాన్ని సీఎం జగనే చీల్చారు.. షర్మిల సంచలన వ్యాఖ్యలు..

Thursday, January 25, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

వైఎస్ కుటుంబాన్ని సీఎం జగనే చీల్చారు.. షర్మిల సంచలన వ్యాఖ్యలు..

సీఎం జగన్‌పై ఏపీసీసీ చీఫ్‌ వైయస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆమె మాట్లాడుతూ వైఎస్సార్ కుటుంబం చీలింది అంటే జగన్ చేతులారా చేసుకున్నది అంటూ తెలిపారు. ఇందుకు సాక్ష్యం దేవుడు, నా తల్లి వైఎస్సార్ భార్య విజయమ్మ, యావత్‌ కుటుంబం సాక్ష్యంగా ఉన్నారని పేర్కొన్నారు. అంతేకానీ జగన్ చెప్పినట్లు రాష్ట్రాన్ని, తన కుటుంబాన్ని కాంగ్రెస్ చీల్చలేదని స్పష్టం చేశారు. వైసీపీ ఇబ్బందిలో ఉన్నప్పుడు తాను నిలబడ్డానని చెప్పుకొచ్చారు. తనను పాదయాత్ర చేయమంటే అరక్షణం కూడా ఆలోచించకుండా ముందుకు దూకానని వివరించారు. ఇంటిని, పిల్లలను కూడా పక్కన పెట్టీ ఎండనక, వాననక రోడ్ల మీదనే ఉన్నానని వాపోయారు.

దారుణంగా వాడుకుని వదిలేశారు..

కాంగ్రెస్ పార్టీకి 18 మంది రాజీనామాలు చేసి జగన్ వైపు నిలబడితే అధికారంలోకి వచ్చాక మంత్రులను చేస్తాను అన్నారని గుర్తు చేశారు. కానీ ఎంతమందిని మంత్రులుగా చేశారో అందరికీ తెలుసన్నారు. వాళ్ల గెలుపు కోసం తాను, తన తల్లి పాటు పడ్డామని గుర్తు చేసుకున్నారు. తెలంగాణలో కూడా ఓదార్పు యాత్ర చేశానని తెలిపారు. ఎప్పుడు అడిగితే అప్పుడు మాట కూడా మాట్లాడకుండా.. ఎందుకు అని అడగకుండా, స్వలాభం చూడకుండా, నిస్వార్థంగా ఏది అడిగితే అది చేశానని వివరించారు. గత ఎన్నికల్లో బై బై బాబు అంటూ ఊరూరా తిరిగానని వెల్లడించారు. కానీ వాడుకుని వదిలేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

సీఎం అయ్యాక జగన్ మారిపోయారు..

ఇన్ని చేసి వైసీపీని గెలిపిస్తే జగన్ ముఖ్యమంత్రి అయ్యారన్నారు. ముఖ్యమంత్రి అయ్యాక జగన్ పూర్తిగా మారిపోయారని చెప్పుకొచ్చారు. అప్పటి నుంచి అందరినీ దూరం చేసుకున్నారని చెప్పారు. తనకు వ్యక్తిగతంగా అన్యాయం చేసినా కూడా బాధపడలేదన్నారు. కానీ తాను మంచి ముఖ్యమంత్రి అయి వైఎస్సార్ పేరు, ఆశయాలను నిలబెడితే చాలు అనుకున్నానని పేర్కొన్నారు. కానీ రాజశేఖర్ రెడ్డి పేరును పూర్తిగా చెడగొట్టారు. రాజశేఖర్ రెడ్డి గారి పాలనకు జగన్ పాలనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని ఎద్దేవా చేశారు.

వైఎస్ కుటుంబాన్ని సీఎం జగనే చీల్చారు.. షర్మిల సంచలన వ్యాఖ్యలు..

బీజేపీకి బానిసలుగా మారారు..

ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ లేకున్నా రాష్ట్రంలో బీజేపీ రాజ్యమేలుతోందన్నారు. రాష్ట్రానికి మేలు చేయకున్నా ఆ పార్టీకి ఎందుకు దాసోహమయ్యారు? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రితో సహా అందరూ బీజేపీకి బానిసలుగా మారాడం ఆశ్చర్యం కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేకహోదా కోసం ఏనాడూ జగన్ ఉద్యమం చేయలేదని.. కనీసం పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడిందీ లేదన్నారు. ఒక రాజధాని కాదు.. మూడు రాజధానులన్నారు. ఇవాళ అసలు రాజధాని ఉందా? లేదా? అనే అనుమానం కలుగుతోందన్నారు.

వారసులమని చెప్పడం కాదు..

వైఎస్‌ను కలవాలంటే ప్రజాదర్బార్‌లో నేరుగా కలిసేవాళ్లు.. అలాగే ఎమ్మె్ల్యేలు కూడా నేరుగా కలిసేవారని గుర్తుచేశారు. కానీ జగన్ మాత్రం ప్రజలను కలవరు.. కనీసం ఎమ్మెల్యేలను కూడా కలవరని విమర్శించారు. వైఎస్‌ ఆశయాలను నిలబెడతారని ప్రజలు జగన్‌ను సీఎంను చేశారని... ఆయన వారసులమని చెప్పడం కాదని... పనితీరులో అది కనపడాలని సూచించారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుండటం చూసి చలించిపోయానని.. కుటుంబం చీలిపోతుందని తెలిసినా ప్రజల కోసం కాంగ్రెస్‌లో చేరానని షర్మిల వెల్లడించారు. మొత్తానికి జగన్‌పై షర్మిల చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు రేపుతున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Related Videos