close
Choose your channels

KCR: కేసీఆర్ వాక్చాతుర్యం.. మాటల తూటాలతో ప్రత్యర్థులకు చుక్కలే..

Tuesday, November 7, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కేసీఆర్ వాక్చాతుర్యం.. మాటల తూటాలతో ప్రత్యర్థులకు చుక్కలే..

తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, తొమ్మిదేన్నరేళ్లు రాష్ట్రాన్ని పాలించారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి అవ్వడానికి శతవిథాలా ప్రయత్నిస్తున్నారు. ఈసారి కూడా కేసీఆర్ సీఎం అయితే తెలుగు నాట వరుసగా మూడు సార్లు ముఖ్యమంత్రి అయిన నాయకుడిగా చరిత్రలో నిలిచిపోతారు.

తెలంగాణ ఉద్యమం నుంచే కేసీఆర్ తన వాక్చాతుర్యంతో ప్రజలను ఆకట్టుకుంటున్నారు. ఎవరికీ సాధ్యం కాని రీతిలో తెలంగాణ ప్రజలకు దగ్గరయ్యారు. యాస, భాషతో జనాలకు తమ నాయకుడిగా ఎదిగారు. ఆయనలోని వాక్చాతుర్యం గురించి చెప్పాలంటే..

కేసీఆర్ వాక్చాతుర్యం.. మాటల తూటాలతో ప్రత్యర్థులకు చుక్కలే..

"తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సోనియా గాంధీ వల్లే సాధ్యమైంది. నేను మనస్ఫూర్తిగా ఆమెకు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను."

"స్వాతంత్ర్య పోరాటంలో మహాత్మా గాంధీ, నెహ్రూ, ఇంకా ఎంతో మంది భారతీయులు పాల్గొన్నారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి స్వతంత్రం తెచ్చుకున్నారు. అందుకని జనం ఎలిజబెత్ మహారాణి వద్దకు వెళ్లి ఆమెకు దండ వేశారా?"

"తెలంగాణకు స్వీయ రాజకీయ ప్రకటన కావాలి. ఉద్యమ పార్టీని కాంగ్రెస్‌లో ఎలా కలిపేస్తారని ప్రజలు అడుగుతున్నారు. ఉద్యమానికి నేను కాపలాగా ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణానికి కూడా నేనే నాయకత్వం వహిస్తాను."

ఈ మూడు ప్రకటనలు చూస్తే కేసీఆర్‌లోని రాజకీయ పరిజ్ఞానం అర్థమవుతుంది. తన మాటలతో ప్రజలను మంత్రముగ్ధులను చేయడంలో కేసీఆర్‌ది అనితరసాధ్యమైన శైలి. రాజకీయాల్లో నాయకుడి ప్రసంగాలకు ఎంత ప్రాధాన్యం ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒక్కొక్క మాట ప్రజల్లో తూటాలా వెళ్తూ ఉంటాయి. అయితే ప్రస్తుత రాజకీయాల్లో మాటకు కట్టుబడి ఉండకపోవడం సాధారణం అయిపోయింది. కానీ దానిని కూడా తన వాక్చాతుర్యంతో ప్రజలను మెప్పించగల నాయకుడిగా కేసీఆర్‌ను పరిగణిస్తారు రాజకీయ విశ్లేషకులు.

కేసీఆర్ వాక్చాతుర్యం.. మాటల తూటాలతో ప్రత్యర్థులకు చుక్కలే..

తెలంగాణ రాష్ట్రం వస్తే టీఆర్ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని గతంలో అన్నారు. సోనియా గాంధీతో కలిసి కుటుంబ సమేతంగా ఫోటో దిగారు. దళితుడిని తొలి ముఖ్యమంత్రిని చేస్తానని మాటిచ్చారు. వీటికి అసెంబ్లీలో తనదైన శైలిలో సమాధానమిస్తూ తమది పక్కా పొలిటికల్ పార్టీ అని ప్రకటించారు. ప్రత్యర్థుల బలాన్ని కూడా తన బలంగా మార్చుకోగల నైపుణ్యం కేసీఆర్ సొంతం. ఉద్యమ భావజాలాన్ని వినిపించడం కాదు ప్రజల గుండెల్లోకి తీసుకెళ్లగల సమర్థుడు. ఉద్యమ సమయంలోనూ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా తన వాగ్ధాటితో ప్రజలను గొప్పగా ప్రభావితం చేస్తారు.

2018లో తన పాలనపై విపక్షాలు చేస్తున్న విమర్శలతో పాటు వ్యతిరేకత వచ్చిందనే అనుమానంతో ముందస్తు ఎన్నికలకు వెళ్లి ప్రత్యర్థులకు చెక్ పెట్టారు. ఒకేసారి అభ్యర్థులను ప్రకటించి విపక్షాలు కోలుకోకుండా చేశారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకోవడాన్ని కేసీఆర్ తనకు అనుకూలంగా మార్చారు. రాజకీయ ప్రసంగాల్లో ఆంధ్రులు మళ్లీ తెలంగాణను దోచుకునేందుకు వస్తున్నారంటూ ప్రజల్లో సెంటిమెంట్ రగిల్చారు. స్వయం పాలనలో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు ఎగబడుతున్నారని ఆవేశపూరిత ప్రసంగాలు చేశారు. దీంతో తెలంగాణ ప్రజలు కేసీఆరే తమ నాయకుడని భావించి భారీ మెజార్టీలో మళ్లీ గెలిపించారు.

కేసీఆర్ వాక్చాతుర్యం.. మాటల తూటాలతో ప్రత్యర్థులకు చుక్కలే..

ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కోసం వాడిగా వేడిగా అప్పుడు మొదలైన కేసీఆర్ వాగ్ధాటి రాటుదేలిపోయింది. తెలంగాణ అస్తిత్వాన్ని ఆవిష్కరించే యాస, భాషలతో సాగే కేసీఆర్ ప్రసంగాలకు తెలంగాణ ప్రజలు ముగ్ధులయ్యారు. ఎంతో సంక్లిష్టమైన సమస్యలను మామూలు మాటల్లో సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడం కేసీఆర్‌కు తప్ప మరెవ్వరికీ సాధ్యం కాదు.

కానీ కేసీఆర్ లాగా ప్రజలను తమ వాగ్ధాటితో ఆకట్టుకునే నాయకుడు మరెవరూ లేకపోవడం గులాబీ పార్టీకి మైనస్‌గా చెప్పుకోవాలి. కేటీఆర్, హరీష్ రావులు తమదైన శైలిలో ప్రసంగాలు ఇచ్చినా.. కేసీఆర్‌లా ప్రజలను ఆకట్టుకునే విధంగా వారి మాటలు ఉండవని విశ్లేషకులు అంటున్నారు. మరో నెల రోజుల్లో ఎన్నికల పోలింగ్ జరగనుంది. కానీ ఇంతకుముందు ఉన్నంత వాక్చాతుర్యం కేసీఆర్‌లో కనపడటం లేదని చెబుతున్నారు. వయసు రీత్యా అనారోగ్య సమస్యలకు గురికావడం కూడా ఆయన వాగ్ధాటిపై ప్రభావం చూపిస్తుందని చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైనా కేసీఆర్ ప్రసంగాల్లో ప్రజలను ఆకట్టుకునేలా నాటి వేడి తగ్గిందని భావిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.