close
Choose your channels

Renuka Chaudhary:ఖమ్మం ఎంపీగా పోటీ చేస్తా.. ఆపే దమ్ము ఎవరికీ లేదు: రేణుకా చౌదరి

Thursday, January 18, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఖమ్మం జిల్లా సీనియర్ నేత, కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం ఎంపీగా పోటీ చేస్తానని.. తాను సీటు అడిగితే కాదనేవారు పార్టీలో లేరని స్పష్టంచేశారు. కానీ తమ నాయకురాలు సోనియా గాంధీని ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని పార్టీ ఏకగ్రీవ తీర్మానం చేశామన్నారు. ఆమె తన నిర్ణయం వెల్లడించే వరకు అందరూ ఓపికగా ఉండాలని కోరారు. ఒకవేళ సోనియా పోటీ చేయకపోతే తానే ఎంపీ అభ్యర్థినని పేర్కొన్నారు. తనను కాదని ఇంకెవరూ పోటీ చేసే అవకాశం లేదన్నారు. ఇక్కడ ఓటు హక్కు తనకే ఉందని వెల్లడించారు.

ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగానే 100 రోజులలో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ఆమె చెప్పారు. ఇప్పటికే రెండు గ్యారంటీలు అమలు చేశామని.. మిగిలిన గ్యారంటీల అమలు కోసం దరఖాస్తులు స్వీకరించామన్నారు. అలాగే నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించిదని గుర్తుచేశారు. గ్రామాల్లో యువకులకు ఉద్యోగం లేకపోతే కనీసం పెళ్లిళ్లు కూడా కావడం లేదన్నారు. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు ఖమ్మం అభివృద్ధికి కృషిచేస్తారనే ఆశాభవం వ్యక్తంచేశారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ భూ అక్రమాలపై విచారణ చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులు పెట్టించి వేధించారని.. వారికి సీఎం రేవంత్ రెడ్డి అండగా ఉండాలని కోరారు.

ఇక అయోధ్య రామమందిరం ప్రారంభోత్సం గురించి ఆమె మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని ఎన్నికల కోసం వాడుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఆలయ నిర్మాణం పూర్తి కాకముందే ప్రాణప్రతిష్ఠ చేయడం మంచి పద్ధతి కాదన్నారు. హిందువులుగా పుట్టిన కాంగ్రెస్ నాయకులకు బీజేపీ సర్టిఫికెట్ అవసరం లేదని మండిపడ్డారు. మీరు ఆహ్వానిస్తే వెళ్లాల్సిన అవసరం తమకు లేదని.. తమ ఇష్టం వచ్చినప్పుడు అయోధ్యకు వెళ్తామని తెలిపారు. కాగా రేణుకా చౌదరి గతంలో ఖమ్మం ఎంపీగా గెలిచి కేంద్రమంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌ పార్టీలో ఆమె ఫైర్ బ్రాండ్‌గా ముద్రపడ్డారు. ఉన్నది ఉన్నట్లు ముక్కుసూటిగా మాట్లాడటం.. ఎంతటి నేతనైనా సరే లెక్కచేయని నైజం ఆమె సొంతం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.