close
Choose your channels

పోలీసులూ మీకిది తగునా.. స్టూడెంట్స్‌పై ఏంటీ ప్రవర్తన!?

Tuesday, April 23, 2019 • తెలుగు Comments

తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చిన మరుక్షణం నుంచి విద్యార్థుల ఆందోళనలు, ఆత్మహత్యలతో అట్టుడుకుతోంది. ఓ వైపు తమకు న్యాయం చేయాలంటూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హైదరాబాద్‌‌లోని ఇంటర్ బోర్డ్ వద్ద ఆందోళనకు దిగుతుండగా.. మరోవైపు విద్యార్థి సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు నిరసనలు చేపట్టాయి. ఇవన్నీ అటుంచితే తాను అన్నీ రాశాను కానీ ఫెయిల్ చేశారు.. తనకు జీరో మార్కులు వేశారు.. ఇలా ఒక్కో విద్యార్థి గాథ చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఈ తప్పిదాలతో ఇంటర్ బోర్డు సభ్యులు వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు కురిపిస్తున్నారు.

ఇక విషయానికొస్తే.. తాను రాసిన పరీక్షల్లో ఫెయిల్ అయ్యానని ఫలితాల్లో చూసుకున్న విద్యార్థిని తన తల్లితో కలిసి తన గోడు ఇంటర్ బోర్డులో చెప్పుకునేందుకు వచ్చింది. సరిగ్గా బోర్డు దగ్గరికి కూడా పోలేదు.. అప్పుడే పోలీసులు వచ్చి ఆ విద్యార్థిని, తల్లిని ఇద్దర్నీ అరెస్ట్ చేశారు. సార్ నేను వచ్చింది నా పరీక్షల గురించి అడిగి తెలుసుకోవడానికి వచ్చాను.. ఫెయిల్ అయిన సబ్జెక్ట్ జవాబు పత్రాలు ఇవ్వమని అడిగేందుకు వచ్చానని గట్టిగా పోలీసులతో వాదించగా.. ఆమె గోడు వినని పోలీసులు వాహనంలోకి లాక్కెళ్లారు. ఈ ఘటన చూసిన వాళ్లంతా తీవ్ర ఆగ్రహావేశాలకు లోనయ్యారు.

పోలీసుల వైఖరిపై సర్వత్రా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే ఇంటర్ బోర్డు తీరుకు వ్యతిరేకంగా.. తెలంగాణ సర్కార్ ఫెయిలైందని ప్రతిపక్షాలు, విద్యార్థి తీవ్రంగా మండిపడుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా పలుచోట్ల పోలీసులు ఆందోళనాకారులను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఇలా జైళ్లకు వెళ్లిన వారు కోకొల్లలు. ఇలా వరుస వివాదాలతో అసలు ‘బంగారు తెలంగాణ’ అంటే ఇదేనా..?.. ఇందుకోసమేనా ప్రత్యేక తెలంగాణ కోరుకున్నది..? అంటూ రాష్ట్ర ప్రజలు కన్నెర్రజేస్తున్నారు. అయితే ఈ వ్యవహారం గంట గంటకూ.. రోజురోజుకూ ముదురుతోందే తప్ప .. ఫుల్‌స్టాప్ పడే అవకాశాలు మాత్రం కనిపించట్లేదు.

Get Breaking News Alerts From IndiaGlitz