close
Choose your channels

మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉపఎన్నికలో 99.86 శాతం ఓటింగ్‌

Thursday, March 28, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉపఎన్నికలో 99.86 శాతం ఓటింగ్‌

మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక(Mahbubnagar local body MLC Election) పోలింగ్ పూర్తైంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకూ జరిగింది. మొత్తం 1439 ఓటర్లకు గానూ 1437 మంది స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నాగర్‌కర్నూలు, నారాయణపేట కేంద్రాల్లో ఇద్దరు మాత్రమే ఓటు హక్కును వినియోగించుకోలేదు. మొత్తం 10 పోలింగ్ కేంద్రాలకు గానూ 8 కేంద్రాల్లో 100 శాతం ఓటింగ్ నమోదైంది. దీంతో మొత్తం 99.86 శాతం ఓటింగ్‌ నమోదు కావడం విశేషం. కొడంగల్ ఎంపీడీవో కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా తన ఎక్స్‌అఫిషియో ఓటు వినియోగించుకున్నారు.

మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉపఎన్నికలో 99.86 శాతం ఓటింగ్‌

స్థానిక సంస్థల కోటా ఎన్నికలకు సంబంధించి 1439 మంది ఓటర్లలో 900 మంది బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులే ఉన్నారు. అయితే వీరిలో చాలా మంది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరగా.. మరికొందరు టచ్‌లో ఉన్నారు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థికి క్రాస్ ఓటింగ్ జరిగిందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయంపై కాంగ్రెస్ పార్టీ ధీమాగా ఉంది. 1439 మంది ఓటర్లలో 888 మంది ఎంపీటీసీలు, 83 మంది జడ్పీటీసీలు, 449 మంది కౌన్సిలర్లు 14 మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు పోలింగ్ ప్రక్రియను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. పోలింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమలు చేశారు.

కాంగ్రెస్ పార్టీ నుంచి టీటీడీ బోర్డు మాజీ మెంబర్ మన్నె జీవన్ రెడ్డి బరిలో ఉండగా.. బీఆర్ఎస్ తరఫున జడ్పీ మాజీ చైర్మన్ నవీన్ కుమార్ రెడ్డి, ఇండిపెండెంట్‌గా సుదర్శన్ గౌడ్ పోటీ పడ్డారు. ఎలాగైనా సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానాన్ని కాపాడుకోవాలని పోలింగ్‌కు ముందు వరకు తమ ప్రజాప్రతినిధులను కాపాడుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ గోవాలో క్యాంప్ రాజకీయాలు చేసింది. అయితే ఆ స్థానాన్ని చేజిక్కించుకోవాలని అధికార హస్తం పార్టీ కూడా తీవ్ర ప్రయత్నాలు చేసింది. మరి ఈ ఎన్నికల్లో ఏ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తారో వేచి చూడాలి. ఏప్రిల్ 2న కౌంటింగ్ జరగనుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.