close
Choose your channels

మోడీ నేను రెడీ.. ఢిల్లీ వేదికగా చంద్రబాబు ఛాలెంజ్

Monday, February 11, 2019 • తెలుగు Comments

మోడీ నేను రెడీ.. ఢిల్లీ వేదికగా చంద్రబాబు ఛాలెంజ్

ఢిల్లీ వేదికగా ఏపీ సీఎం చంద్రబాబు ధర్మపోరాట దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. ప్రముఖులకు నివాళులు అర్పించిన అనంతరం ఏపీ భవన్ ప్రాంగణంలో బాబు దీక్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదివారం నాడు ప్రధాని మోదీ మాట్లాడిన మాటలను ప్రస్తావనకు తెచ్చి స్ట్రాంగ్ కౌంటర్ల వర్షం కురిపించారు. చంద్రబాబు సభకు పలువురు జాతీయస్థాయి నేతలు, ప్రాంతీయ పార్టీ నేతలు, ప్రముఖులు సంఘీబావం తెలిపారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ దీక్ష సాయంత్రం 8గంటల వరకు జరగనుంది. 

కాగా ఈ ప్రసంగం మొత్తం పాతదే కావడం గమనార్హం. ప్రధాని పర్యటన అనంతరం ఆదివారం నాడు బాబు మాట్లాడిన మాటలే సేమ్ టూ సేమ్ ఢిల్లీలో కూడా దింపేశారు. బాబు స్పీచ్‌‌లో కొత్తదనమేమీ లేకపోవడంతో టీవీలు చూస్తున్న ఏపీ ప్రజలు, సభకు హాజరైన సభికులు ఒకింత ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది. కాగా బాబు స్పీచ్‌‌పై నెటిజన్లు కామెంట్ వర్షం కురిపిస్తున్నారు. ఇదిగో బాబుగారి స్పీచ్ మీరూ ఓ సారి చూడండి.

ఎప్పుడైతే పాలకులు, పరిపాలించే వ్యక్తులు ధర్మాన్ని పాటించనప్పుడు, అదే విధంగా ఒక రాష్ట్రం పట్ల, ఒక ప్రాంతం పట్ల వివక్ష చూపించినప్పుడు, అన్యాయం చేసినప్పుడు న్యాయం కోసం పోరాడవలసిన బాధ్యత మనందరిపైనా ఉందని బాబు చెప్పుకొచ్చారు. ఆ న్యాయ పోరాటం కోసమే మనమందరం ఇక్కడకు వచ్చామన్నారు. ఈ రోజు చలిని కూడా లెక్కబెట్టకుండా మహాత్మాగాంధీ ఘాట్‌కు వెళ్లి నివాళులు అర్పించి, అంబేద్కర్ కు నివాళులు అర్పించి, ఎన్టీఆర్ ఆత్మ సాక్షిగా మనందరం ఇక్కడ సమావేశమయ్యే పరిస్థితికి వచ్చామని ఆయన అన్నారు. ఈ పరిస్థితికి తీసుకొచ్చిన ఈ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయవలసిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు.

నిరంతరం పోరాడుతున్నాం!

"పార్లమెంట్ లో విభజన చట్టం పెట్టి, హామీలెన్నో ఇచ్చి రాష్ట్రాన్ని విభజించారని, హైదరాబాద్ తెలంగాణకు వెళ్లడంతో, నాడు ప్రత్యేక హోదాకు హామీ ఇచ్చారు. ఆ హామీల అమలుకు నిరంతరం పోరాడుతున్నా. నేను న్యూఢిల్లీలో ధర్మ పోరాట దీక్ష తలపెడితే, అందుకు ఒకరోజు ముందు ప్రధాని నరేంద్ర మోదీ ఏపీలో పర్యటించారు. ఆ అవసరం ఇప్పుడేమొచ్చింది?. గోద్రా అల్లర్లలో గుజరాత్ పాలకులు ధర్మాన్ని విస్మరించారని నాడు వాజ్ పేయి స్వయంగా వ్యాఖ్యానించారు. వారే ఇప్పుడు పాలకులుగా ఉన్నారు. విభజన సమయంలో ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదాను ప్రకటిస్తే, నాటి విపక్ష నేత, నేటి ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ, నాటి ఎంపీ, నేటి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదేళ్లు హోదా కావాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు వారు హోదా ఎందుకు ఇవ్వడం లేదు" అని ఈ సందర్భంగా చంద్రబాబు నిలదీశారు.

నేను లెక్కలు చెప్పడానికి రెడీ..

ఏపీకి కేంద్రం ఇచ్చిన లెక్కలు చెప్పడానికి తాను సిద్ధంగా ఉన్నానని.. ఏపీ కట్టిన ట్యాక్స్ లెక్కలు, మా నుంచి వచ్చిన ఇతరత్రా ఆదాయాల గురించి మీరు చెప్పగలరా..? అంటూ ఢిల్లీ వేదికగా మోదీకి చంద్రబాబు సవాల్ విసిరారు. "రాష్ట్రంలో వస్తున్న ఆదాయం ఖర్చులకు సరిపోవడం లేదని, రూ. 16 వేల కోట్ల లోటులో రాష్ట్రం ఉందని చెప్పిన చంద్రబాబు, కేంద్రం కేవలం రూ. 3,900 కోట్లు మాత్రమే ఇచ్చింది. విభజన చట్టంలోని 18 హామీలను నెరవేర్చాల్సి వుంది.. రాయలసీమ, ఉత్తరాంధ్రలకు బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీ ఇస్తామని చెప్పి మోసం చేశారు. రాష్ట్రానికి ఇచ్చిన నిధులను కూడా వెనక్కు తీసుకున్న ఘనత కేంద్రానిదే. విశాఖకు రైల్వే జోన్ ఇస్తామన్న హామీని నెరవేర్చలేదు. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి, నిర్మాణానికి నిధులు ఇవ్వడం లేదు. అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను పెంచుతామన్న హామీని నెరవేర్చలేదు. ఇలా ఎన్నో అంశాల్లో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని గుర్తు చేసి, కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకే నేను హస్తినకు వచ్చాను" అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

కేంద్రంపై తీవ్ర ఆగ్రహం..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం పట్ల తీవ్రమైన ఆగ్రహంతో ఉందన్నారు. పరిపాలించే వ్యక్తులు... ప్రజల మనోభావాలను గుర్తు పెట్టుకుని, పరిపాలిస్తే, దేశ సమగ్రతకు భంగం కలగకుండా ఉండే పరిస్థితి వస్తుందన్నారు. మేము ఢిల్లీలో ఉన్నాం.. మాకు అధికారం ఇచ్చారు కదా  మెజారిటీ ఉందని ఇష్ట ప్రకారం మేము చేస్తామంటే... మీ ఆటలు సాగవని బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిపాలించే వ్యక్తులు బాధ్యతగా ఉండాలని ఈ సందర్భంగా మోదీ సర్కార్‌‌కు హితవు పలికారు. బాధ్యత విస్మరించి, ఇష్టానుసారం చేస్తామని, అధికారం నెత్తికెక్కినప్పుడు... మళ్లీ ఆ నెత్తికెక్కిన అధికారాన్ని దించే అధికారం ఈ ప్రజలకు ఉందని గుర్తు పెట్టుకోవాలన్నారు. "మనం పోరాడేది మన కోసం కాదు... ఐదు కోట్ల మంది ప్రజల కోసం పోరాడుతున్నాం. భావి తరాల కోసం పోరాడుతున్నాం. ఆత్మాభిమానం కోసం పోరాడుతున్నాం. జీవితంలో ఆస్తులు పోగొట్టుకుంటే మళ్లీ సంపాదించుకోవచ్చుగానీ, ఆత్మగౌరవాన్ని పొగొట్టుకుని బతకలేమని చెప్పిన వ్యక్తి ఎన్టీ రామారావు. తెలుగువారి సత్తా, ప్రజల నాడి తెలియని వ్యక్తి నరేంద్ర మోదీ " అని చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Get Breaking News Alerts From IndiaGlitz