close
Choose your channels

Chandrababu:60 రోజుల్లో మెగా డీఎస్సీ.. ఐదేళ్లలో 25లక్షల ఉద్యోగాలు ఇస్తాం: చంద్రబాబు

Wednesday, March 27, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

పరదాల వీరుడు సీఎం జగన్‌తో జాగ్రత్తగా ఉండాలని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలకు సూచించారు. బస్సు యాత్ర అంటూ పరదాలు తీసి రోడ్లపైకి వస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. ప్రజాగళం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా పలమనేరు, పుత్తూరులో నిర్వహించిన సభల్లో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదలకు రూ.5కే అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లను రద్దు చేసిన వ్యక్తి పేదల మనిషి అవుతాడా? అని ప్రశ్నించారు. అధికారంలోకి రాగానే మళ్లీ అన్నా క్యాంటీన్లు పెడతామని హామీ ఇచ్చారు. అలాగే టిడ్కో ఇళ్లు ఇవ్వకుండా పేదలను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు.

కూటమి అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లో మెగా డీఎస్సీ నిర్వహిస్తామని.. అలాగే యువతకు ఐదేళ్లలో 25 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. జగన్ పేదల మనిషి అంట తాను పెత్తందారు అంట.. దేశంలో ముఖ్యమంత్రులందరికీ ఎంత ఆస్తి ఉందో వాళ్లందరి కంటే ఎక్కువ ఆస్తి జగన్‌కు ఉందన్నారు. ఐదేళ్లలో ప్రజల ఆదాయం తగ్గింది కానీ, జగన్ ఆదాయం మాత్రం రెట్టింపైందన్నారు. జగన్ రెడ్డి సిద్ధంగా ఉండు.. నీ ప్రభుత్వాన్ని, నీ కుర్చీని బంగాళాఖాతంలో కలిపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. మే 13 తర్వాత జగన్‌ను ఇంటికి పంపడం.. ఆయన పార్టీని బంగాళాఖాతంలో కలపడం ఖాయమని బాబు ధీమా వ్యక్తం చేశారు.

తన తండ్రి వైఎస్ సమాధి వద్దకు బాబాయిపై గొడ్డలి వేటు వేసిన వాళ్లను తీసుకెళ్లారని విమర్శించారు. జగన్‌తో పాటు బస్సులో అవినాశ్ రెడ్డి ఉన్నారని.. బాబాయ్ హత్య కేసు నిందితుడిగా ఆరోపణలు ఉన్న అలాంటి వ్యక్తికి ఎంపీ టికెట్ ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబాయినే చంపిన వారికి ప్రజలు ఓ లెక్కా అని ప్రశ్నించారు. రాయలసీమ అభివృద్ధికి జగన్ చేసిందేమి లేదని.. సీమ ద్రోహి అని ఆరోపించారు. అనంతపురానికి నీళ్లు తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిది అన్నారు. కియా పరిశ్రమను అనంతపురం జిల్లాలో ఏర్పాటయ్యేలా టీడీపీ ప్రభుత్వం కృషి చేసిందని గుర్తు చేశారు. రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులకు దివంగత నేత ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారని, ఆ ప్రాజెక్టులను తాను మరింత అభివృద్ధి చేశానని వెల్లడించారు.

ఇక పుత్తూరులో మంత్రి రోజా గురించి మాట్లాడుతూ ఇక్కడొక జబర్దస్త్ ఎమ్మెల్యే ఉన్నారని.. నియోజకవర్గానికి ఏమైనా మంచి చేశారా అని ప్రశ్నించారు. వైసీపీ నేత అయిన కౌన్సిలర్ భువనేశ్వరి అనే మహిళ దగ్గర మున్సిపల్ చైర్మన్‌గా చేస్తామని రూ.40 లక్షల తీసుకున్నారంటే వీళ్లను ఏమనాలి? అని మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే తీరు ఇలా ఉంటే ఇలాంటి నేతలను ప్రోత్సహిస్తున్న జగన్ తీరు ఇంకెలా ఉంటుంది? అని ప్రశ్నించారు. నగరి నియోజకవర్గం అంతా అరాచకం అని ధ్వజమెత్తారు. ఇలాంటి వారందరిని ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించి ఇంటికి పంపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.