close
Choose your channels

ఎంపీ ఎఫెక్ట్.. ‘ఆదీ’.. మాకొద్దంటున్న బీజేపీ.. !?

Friday, September 20, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఎంపీ ఎఫెక్ట్.. ‘ఆదీ’.. మాకొద్దంటున్న బీజేపీ.. !?

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల అనంతరం టీడీపీకి చెందిన పలువురు సిట్టింగ్‌లు, ముఖ్యనేతలు, కీలకనేతలు ఆ పార్టీకి టాటా చెప్పేసి బీజేపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. అంతేకాదు మరికొందరు లైన్‌లో ఉన్నారని.. కేంద్ర మంత్రి అమిత్ షా ఒక్కమాట చెబితే చాలు క్యూ కడతారని తెలుగు రాష్ట్రాల కమలనాథులు మీడియా ముందుకువచ్చి చెప్పుకుంటున్నారు. ఇదంతా ఓకే కానీ.. ఏపీకి చెందిన మాజీ మంత్రిని మాత్రం అస్సలు చేర్చుకోలేమని.. అధిష్టానం తేల్చిచెప్పిందట. ఇందుకు చాలా కారణాలే ఉన్నాయని తెలుస్తోంది. ఇంతకీ ఆ నేత ఎవరో..? ఎవరు అడ్డుకుంటున్నారో..? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.

ఎవరా మాజీ మంత్రి..!?
మాజీ మంత్రి, టీడీపీ నేత ఆదినారాయణ రెడ్డి.. గురించి ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున జమ్మలమడుగు నుంచి పోటీ చేసిన ఈయన.. పార్టీ అధికారంలోకి రాకపోయేసరికి సైకిలెక్కేసి ఎవరూ ఊహించని రీతిలో మంత్రి పదవి దక్కించుకున్నాడు. జగన్ ఇలాఖా మనిషి, జగన్‌నే తిట్టే కెపాసిటి, ఒక్కటే సామాజిక వర్గం కావడంతో ఈ క్వాలిఫికేషన్స్ అన్నీ చూసిన నాటి సీఎం చంద్రబాబు ఆయనకు మంత్రి పదవి కట్టబెట్టారు. అయితే 2019 ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాకపోవడం.. ఆయన్ను వివాదాలు, కేసులు వెంటాడుతుండటంతో ఇక టీడీపీకి టాటా చెప్పేసి బీజేపీ తీర్థం పుచ్చుకోవాలని డిసైట్ అయ్యారు. అంతేకాదు తాను బీజేపీలోకి వెళ్తున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు మీడియాకు చెప్పి ఢిల్లీ ఫ్లైట్ ఎక్కారు.

వారం నుంచి ఢిల్లీలోనే తిష్ట!
ఆది ఫ్లైట్ ఎక్కి ఢిల్లీలో దిగి వారం రోజులు అయిన్పటికీ ఆయనకు అమిత్ షా గానీ, బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా కానీ అపాయిట్మెంట్ ఇవ్వలేదట. అందుకే వారం నుంచి ఢిల్లీలోనే ఆయన తిష్ట వేయాల్సి వచ్చిందట. బలమైన సామాజికవర్గం నుంచి వచ్చిన నేత.. పైగా కీలక నేత కావడంతో మొదట పార్టీలో చేర్చుకోవాలని బీజేపీ పెద్దలు భావించినప్పటికీ ఆ తర్వాత మాత్రం వద్దనుకుందట. అయితే ఈ విషయాన్ని పెద్దలు ఆయనతో డైరెక్టుగా చెప్పలేక.. అపాయిట్మెంట్ ఇవ్వకుండా తిప్పుకుంటున్నారని తెలుస్తోంది.

అడ్డుకుంటున్నదెవరు..!?
ఆదిని పార్టీలోకి రాకుండా అడ్డుకుంటున్నది టీడీపీకి టాటా చెప్పి.. బీజేపీ తీర్థం పుచ్చుకున్న రాజ్యసభ సభ్యుడు, సొంత జిల్లా నేత సీఎం రమేష్ అని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆది అనుచరులు, అభిమానులు బాహాటంగా చెప్పేస్తున్నారు. మొత్తం ఢిల్లీ వేదికగా రమేష్ తతంగం నడుపుతున్నారని.. ఆయన కడపకు వస్తే అడ్డుకుంటామని వార్నింగ్‌లు సైతం ఇస్తున్నారని సమాచారం. వాస్తవానికి రమేష్ ఇంతవరకూ ప్రత్యక్ష ఎన్నికలకు పోయిన దాఖలాల్లేవ్.. బహుశా భవిష్యత్తులో కూడా ఉండవ్.. అయితే ఆర్థిక బలంతో అలా అప్పుడు టీడీపీలో ఇప్పుడు బీజేపీలో నెట్టుకొస్తున్నారు.

ఇదీ అసలు సంగతి..!
కడప జిల్లా మొత్తం ప్రస్తుతం తన చేతిలో ఉందని ఫీలవుతున్న సీఎం రమేష్.. ఆది లాంటి పెద్ద తలకాయను చేర్చుకుంటే మనకు పరిస్థితులు అనుకూలించవేమోనని ముందుగానే గ్రహించి.. ఆదిపై లేని పోని మాటలు అధిష్టానానికి చెప్పారట. దీంతో ఇలాంటి వ్యక్తి మన పార్టీలోకి అవసరమా..? అని ఆలోచించిన కమలనాథులు ఆయన్ను చేర్చుకోకుండా ఇలా అస్తమాను ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటున్నారట.

వాస్తవానికి సీఎం రమేష్ ఏ పార్టీలో ఉన్నా ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఆయన వ్యవహారం సొంత పార్టీ నేతలకే నచ్చవ్.. ఇది టీడీపీలో ఉన్నప్పుడు పలుమార్లు నిరూపితమైంది. ఈయన్ను కడప జిల్లాకు చెందిన సీనియర్ నేత వరదరాజుల రెడ్డి మీడియా ముందుకొచ్చి బూతులు తిట్టిన సందర్భాలు కోకొల్లలు. ఇప్పుడు బీజేపీలో చేరిన తర్వాత వరద మాత్రం ఆయన్ను వదలట్లేదు. అందుకే ఇలా అస్తమాను తమపై విమర్శలు చేసే వాళ్లను మనం ప్రోత్సహించకూడదని భావించిన రమేష్.. ఆదిని అడగడుగునా అడ్డుకుంటున్నారని తెలుస్తోంది. మరి ఈ వ్యవహారం ఎంతవరకు వెళ్తుందో..? ఇందులో నిజమెంతో..? అసలు ఆది నెక్స్ట్ ఏం చేయబోతున్నారో..? తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.