close
Choose your channels

భారత్ పెగాసస్‌ను 2017లోనే కొనుగోలు చేసింది... న్యూయార్క్ టైమ్ సంచలన కథనం

Saturday, January 29, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

గతేడాది భారత రాజకీయాల్లో ‘‘పెగాసస్’’ ఎంతటి దుమారం రేపిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతిపక్షనేతలు, మీడియా సంస్థల అధినేతలు, జర్నలిస్టులు, పలు సంస్థలకు చెందిన వారి ఫోన్‌లపై కేంద్ర ప్రభుత్వం నిఘా పెట్టిందని ఆరోపణలు వచ్చాయి. కానీ కేంద్రం దీనిని ఖండించింది. తమకు అలాంటి ఉద్దేశం లేదని వ్యాఖ్యానించింది. కొందరు ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో పెగాసస్‌ స్పైవేర్‌తో ఫోన్ల హ్యాకింగ్‌ వ్యవహారంపై సుప్రీంకోర్టు స్వతంత్ర నిపుణుల కమిటీతో దర్యాప్తుకు ఆదేశించింది. ఈ కమిటీ పనితీరును స్వయంగా సుప్రీం పర్యవేక్షిస్తోంది.

ఈ వ్యవహారం సద్దుమణిగింది అనుకుంటున్న సమయంలో అంతర్జాతీయ వార్తా సంస్థ న్యూయార్క్ టైమ్స్ సంచలన కథనం ప్రచురించింది. భారత ప్రభుత్వం పెగాసస్ స్పైవేర్‌ను రక్షణ ఉత్పత్తుల కొనుగోలులో భాగంగా .. ఇజ్రాయెల్‌ను నుంచి కొనుగోలు చేసిందని న్యూయార్క్ టైమ్స్ వెల్లడించడంతో మరోసారి దేశ రాజకీయాలు వేడెక్కాయి. ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ బాధ్యతలు చేపట్టిన తరవాత 2017లో మూడు రోజుల ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా రెండు బిలియన్ డాలర్ల విలువైన రక్షణ పరికరాల కొనుగోలుకు ఇజ్రాయెల్‌తో ఒప్పందం చేసుకున్నారు. ఇందులోనే పెగాసస్ స్పైవేర్ కూడా ఉందని న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) కూడా ఈ పెగాసస్ స్పైవేర్‌ను కొనుగోలు చేసిందని కానీ దాన్ని వినియోగించకూడదని నిర్ణయం తీసుకుందని తెలిపింది.

ఇజ్రాయెల్‌తో భారత్ ఒప్పందం జరిగిన కొన్ని నెలల తర్వాత అప్పటి ఇజ్రాయెల్‌ అధ్యక్షుడు బెంజమిన్‌ నెతన్యాహూ మనదేశంలో పర్యటించారు. అంతేకాదు 2019 జూన్‌లో ఐక్యరాజ్యసమితిలో పాలస్తీనాకు అబ్జర్వర్‌ హోదాపై జరిగిన ఓటింగ్‌లో ఇజ్రాయెల్‌కు అనుకూలంగా భారత్‌ ఓటువేసింది అని న్యూయార్క్‌ టైమ్స్‌ తన కథనంలో పేర్కొంది. అయితే ఈ కథనాలను కేంద్ర ప్రభుత్వ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి. స్థానిక నిపుణులను సంప్రదించకుండా థర్డ్‌ పార్టీ సాఫ్ట్‌వేర్‌ను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయదని స్పష్టం చేశాయి. పెగాసస్‌ను రూపొందించింది ఓ ప్రైవేటు సంస్థ అని, దీనిపై ఇజ్రాయెల్‌ ప్రభుత్వంతో ప్రత్యక్ష, పరోక్ష ఒప్పందాలేవి జరగేదని సదరు వర్గాలు అంటున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో మరోసారి ‘‘పెగాసస్’’ వ్యవహారం కేంద్రాన్ని ఇరుకున పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.