close
Choose your channels

Janasena : జగన్ గారూ.. సాయంలోనూ కులాలా, వాళ్లని రైతులే కాదంటారా : నాదెండ్ల మనోహర్ విమర్శలు

Friday, June 17, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కేంద్రం అందించే రైతు భరోసా సాయంలోనూ రాష్ర్ట ప్రభుత్వం కులాలను చూస్తోందని ఆరోపించారు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. గుంటూరులో జరిగిన మీడియా సమావేశం ఆయన మాట్లాడుతూ.. సాయంలోనూ ఓట్ల రాజకీయాలకు వైసీపీ ప్రభుత్వం తెరలేపిందని మండిపడ్డారు. ప్రతి ఏటా కేంద్రం రూ. 17 వేల కోట్లను సాయంగా ఇస్తుంటే, దాన్ని రాష్ర్ట ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. కౌలు రైతులను ఆదరించాల్సిన రాష్ర్ట ప్రభుత్వం- వారు అసలు రైతులే కాదన్నట్లుగా మాట్లాడుతోందని ఆయన మండిపడ్డారు.

పవన్ సాయం చూసి జగన్‌కి భయమేస్తోంది:

ప్రతిసారి ఈ ముఖ్యమంత్రి కౌలు రైతులను అవమానపరుస్తున్నారని... వారి వేదనను అపహాస్యం చేస్తున్నారని నాదెండ్ల ఫైరయ్యారు. వారి చావులను చిన్నవి చేసి మాట్లాడుతున్న ఈ ముఖ్యమంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులకు ఏ మేలు చేయని జగన్ రెడ్డికి పవన్ కళ్యాణ్ చేస్తున్న సాయం చూసి భయం వేస్తోందని నాదెండ్ల మనోహర్ ఎద్దేవా చేశారు. అందుకే ప్రభుత్వ సభల్లో రాజకీయ విమర్శలకు దిగుతున్నారని.. ఆయన ఎంత సంస్కారవంతుడో దీనిని బట్టే అర్ధమవుతుందని జగన్‌పై మండిపడ్డారు.

రైతుల ఖాతాల్లో పడని ధాన్యం డబ్బులు:

రాష్ర్ట బడ్జెట్లో కౌలు రైతులకు సంబంధించి రూ.1.11 లక్షల కోట్ల రుణాల ఇస్తామని ప్రకటించారని... కానీ ఇచ్చింది కేవలం రూ.4,100 కోట్లు మాత్రమేనని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. కౌలు రైతులు సాగు కోసం వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు తెచ్చి దానిని కట్టుకోలేక ఇబ్బందిపడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రబీ ధాన్యం అమ్మినా డబ్బులు ఇవ్వడం లేదని.. 50 రోజులు కావొస్తున్నా ఉమ్మడి గుంటూరు జిల్లాలో రూ.400 కోట్లు రైతుల ఖాతాల్లో పడలేదని నాదెండ్ల ఆరోపించారు. అలాగే ప్రకాశం జిల్లాలోనూ 25 కోట్ల రూపాయలు రైతులకు అందాలని మనోహర్ తెలిపారు. ఈ సమస్యలపై మాట్లాడుకుండా, ప్రభుత్వ లోపాలను కప్పిపుచ్చుకోవడానికి ఇతరుల మీద విమర్శలు చేసి సీఎం ఆనందపడుతున్నారని ఎద్దేవా చేశారు. మీ విమర్శల్ని పక్కన పెట్టి ముందు రైతు సమస్యలు తీర్చేలా దృష్టి సారించాలని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు.

బాధితుల్ని మా దృష్టికి తీసుకురండి:

బాధితులు ఇంకా ఎవరైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావచ్చని ఆయన సూచించారు. కేవలం ఇంత మందికే సాయం చేస్తామని తాము లక్ష్యం పెట్టుకోలేదని.. ప్రతి బాధితుడికి సాంత్వన చేకూరాలన్నదే తమ లక్ష్యమన్నారు. కేవలం బాధిత కుటుంబాలకు రూ.లక్ష ఇచ్చేసి బాధ్యత అయిపోయిందని అనుకోవడం లేదని నాదెండ్ల స్పష్టం చేశారు. వారి కుటుంబాల్లోని పిల్లలకు తాము విద్య గురించి, భవిష్యత్ గురించి భరోసా ఇచ్చేలా ఆలోచిస్తున్నామని... బాధిత కౌలు రైతు కుటుంబాల్లోని గొప్ప వ్యక్తులు బయటకు రావాలని మనోహర్ విజ్ఞప్తి చేశారు. ప్రజా సమస్యల మీద ఎప్పటికప్పడు స్పందిస్తున్నామని... వాటిపై ప్రజా పోరాటాలు నిర్వహించామని నాదెండ్ల చెప్పారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.