close
Choose your channels

కమలం కంచుకోటను ప్రకాశ్‌‌రాజ్ బద్ధలు కొడతారా!?

Saturday, January 19, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కమలం కంచుకోటను ప్రకాశ్‌‌రాజ్ బద్ధలు కొడతారా!?

రీల్ లైఫ్‌‌లో ఎంతో మందిని సీఎంలను.. ఎన్నో పార్టీలను స్థాపించిన నటుడు ప్రకాశ్ రాజ్‌‌ రియల్‌‌ లైఫ్‌లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిఅదృష్టాన్ని పరిశీలించుకోబోతున్నారు. ఆ ఎంట్రీ కూడా కమలం కంచుకోట అయిన బెంగళూరు నుంచే కావడంతో సినీ ప్రియులు, బెంగుళూరు వాసుల దృష్టి ఆయనపై పడింది. బీజేపీ అంటే ఒంటికాలిపై లేచే ప్రకాశ్ ఇప్పుడు ఆ పార్టీ కంచుకోటను బద్ధలు కొట్టాలని కంకణం కట్టుకున్నారు. ఎప్పట్నుంచో సోషల్ మీడియా, ఇంటర్వ్యూ వేదికలగా బీజేపీ చేస్తున్న అవినీతిని, మతోన్మాదాన్ని ఎండగడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ప్రకాశ్ రాజ్ వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు.

పార్టీ తరఫున కాదు.. స్వతంత్రంగానే..
తాను రాజకీయాల్లోకి వస్తున్నానని ఇప్పటికే ప్రకటించిన ప్రకాశ్.. తాజాగా ఎక్కడ్నుంచి పోటీ చేస్తారనేదానిపై క్లారిటీ ఇచ్చారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తాను బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నట్టు తేల్చేశారు. ఏ పార్టీ తరఫున తాను పోటీచేయనని..  స్వతంత్ర అభ్యర్థిగా మాత్రమే పోటీచేస్తానని మరోసారి స్పష్టం చేశారు. రాజకీయ నాయకులంతా దొంగలేనని.. వాళ్లు కులాలు, డబ్బు ఆధారంగా ప్రజలను చేరదీస్తారంటూ దుమారం రేపే వ్యాఖ్యలు చేశారు. అందుకే తాను ఏ పార్టీలోనూ చేరకుండా స్వతంత్రంగా పోటీ చేయడానికి సిద్ధమయ్యానన్నారు.

కంచుకోట నుంచే పోటీ.. 
ఇదిలా ఉంటే.. ప్రకాశ్ ఎంచుకున్న బెంగళూరు సెంట్రల్ బీజేపీకి కంచుకోట. గత పదేళ్లుగా ఈ నియోజకవర్గం నుంచి పీసీ మోహన్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2009, 2014 ఎన్నికల్లో ఆయన్ను ఢీ కొట్టలేక చతికిలపడిన పార్టీలు చాలానే ఉన్నాయి. అయితే ప్రకాశ్ రాజ్ ఏ మేరకు ప్రభావితం చేయగలరు అనేది ప్రశ్నార్థకమే. పైగా ఇక్కడ్నుంచే పోటీ చేస్తానని పదేపదే చెబుతుండటంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

పీసీ మోహన్ రికార్డ్స్ ఇవీ..
2009 విషయానికొస్తే ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, జేడీఎస్, బీఎస్పీతో పాటు సుమారు 20 మంది అభ్యర్థులు బరిలో నిలవగా పీసీ మోహన్‌కు ఓడించలేకపోయారు.. కనీసం ఓట్లు కూడా చీల్చలేకపోయారు. ఈ ఎన్నికల్లో 35 వేలకు పై చిలుకు ఓట్ల మెజార్టీతో రికార్డు సృష్టించారు. 2014 ఎన్నికల్లో ఇదే పీసీ మోహన్‌పై పలు పార్టీల అభ్యర్థులు పోటీ చేసినప్పటికీ ఏ మాత్రం ప్రయోజనం లేకపోయింది. అంతేకాదు ఈ ఎన్నికల్లో పీసీ కనివినీ ఎరుగని 1,37,500 మెజార్టీతో గెలుపొందడం గమనార్హం. ఇలా వరుసగా రెండు సార్లు గెలిచి ఆయన రికార్డ్‌‌ను ఆయనే బ్రేక్ చేసుకున్నారు. మున్ముందు ఇంకెన్నీ రికార్డ్స్ ఉంటాయో.

అయితే ఇక్కడ్నుంచే ప్రకాశ్ పోటీ చేయాలనుకోవడం వెనుక ఎంత బలమైన కారణముందో తెలియట్లేదు. సినీ నటుడు వస్తున్నాడంటే కోలాహలంగా జనాలు రావడం, స్పీచ్‌‌లు వింటారే తప్ప.. ఓట్లు దాకా వచ్చేసరికి పరిస్థితులు తారుమారవుతాయి. ఒకప్పుటి పరిస్థితులు వేరు.. ఇప్పుడు వేరు..? పైగా గెలవాలంటే నిత్యం జనాల్లో తిరగాలి.. తానిచ్చిన హామీలు నెరవేరుస్తానని ప్రజలకు భరోసా కల్పించాలి.. ముఖ్యంగా కోట్లు కుమ్మరించాలి కూడా..? ఇన్ని సాహసాలు చేస్తేనే గెలుపు మీద కాసిన్ని ఆశలు ఉంటాయ్. అయితే ప్రకాశ్ రాజ్‌‌కు బెంగళూరు సెంట్రల్‌‌లో గెలవాలని విధి రాత రాసుందేమో వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.