close
Choose your channels

Rahul and Priyanka:అధికారంలోకి వస్తే చేసి చూపిస్తాం.. ములుగు సభా వేదికగా రాహుల్, ప్రియాంక భరోసా

Thursday, October 19, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఇచ్చిన ఉత్సాహంతో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతుంది. ఆ రాష్ట్రంలో ఇచ్చిన గ్యారంటీ హామీలు సత్ఫలితాలను ఇవ్వడంతో ఇకపై ఎన్నికలు జరిగే అన్ని రాష్ట్రాల్లో ఇదే స్ట్రాటజీ అమలు చేస్తోంది. తెలంగాణలోనూ తుక్కుగూడ సభ వేదికగా ఆరు గ్యారంటీ హామీలను ప్రకటించింది. ఒక్క ఛాన్స్ ఇవ్వండి హామీలను చేసి చూపిస్తామనే నినాదంతో ముందుకు సాగుతోంది. ఈసారి తెలంగాణలో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని దృఢ సంకల్పంతో ఉన్న కాంగ్రెస్ ఇందుకు తుక్కుగూడ సభను వేదికగా చేసుకుంది. ఈ సభ నుంచే కాంగ్రెస్ అగ్రనేత్రి సోనియా గాంధీ ఆరు గ్యారంటీలను ప్రకటించారు. ఎన్నో దశాబ్దాల కలగా ఉన్న ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన సోనియానే ఈ హామీలు ఇవ్వడంతో ప్రజల్లో నమ్మకం పెరిగింది.

ప్రజల ఆశయాలు నెరవేరాలంటే కాంగ్రెస్ రావాలి..

అప్పటి నుంచి ఆరు గ్యారంటీ హామీలను స్థానిక కాంగ్రెస్ నేతలు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. తాజాగా జరిగిన ములుగు విజయభేరి సభలోనూ ఆ పార్టీ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ హామీలను నెరవేర్చుతామని ప్రకటించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అన్ని రాష్ట్రాల్లో ఇచ్చిన హామీలు ఎలాగైతే అమలు చేస్తున్నామో.. తెలంగాణలో కూడా అదే చేసి చూపిస్తామని ఉద్ఘాటించారు. ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్న తెలంగాణ ప్రజల ఆశలు, ఆశయాలు నెరవేరాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని పిలుపునిచ్చారు. ఆరు గ్యారంటీలతో పాటు తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో ప్రజలకు వివరించారు.

రూ.4వేల చొప్పున నిరుద్యోగ భృతి..

అమరవీరుల కుటుంబాలకు అండగా కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని చెప్పారు. ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని యువతకు రూ.4వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. సమ్మక్క-సారలమ్మ జాతరను జాతీయ పండుగగా గుర్తిస్తామని పోడు రైతులకు పట్టాలిస్తామని భరోసా ఇచ్చారు. దళితులకు ప్రత్యేక రిజర్వేషన్లు, అంబేద్కర్ భరోసా పథకం, ఇందిరమ్మ పథకం కింద స్థలంతో పాటు రూ.6 లక్షల రుణం ఇస్తామన్నారు. అలాగే రైతులకు 2 లక్షల రూణమాఫీ చేస్తామని.. పంటలకు మద్దతు ధర పెంచడంతో పాటు ప్రతి ఎకరాకు రూ.15 వేలు, రైతు కూలీలకు రూ.12 వేలు అందజేస్తామని వెల్లడించారు.

హామీలను కేసీఆర్ విసర్మించారు..

ఇదే సమయంలో గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించిందని విమర్శించారు. దళితులకు మూడెకరాల భూమి, ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న కేసీఆర్ హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. బంగారు తెలంగాణ చేస్తామన్న కేసీఆర్ తన కుటుంబాన్ని మాత్రం బంగారం చేసుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. మొత్తానికి తాము అధికారంలో వస్తే ఏం చేస్తామో స్పష్టంగా చెప్పడంతో పాటు అధికార బీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు రాహుల్, ప్రియాంక.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.