close
Choose your channels

ఈ నెల 17న టీఎస్సార్ 'కాకతీయ కళా వైభవ మహోత్సవం'

Saturday, January 13, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఎప్పుడూ కళలను, కళాకారులను గౌరవిస్తూ, ప్రోత్సహించే మంచి మనసున్న మనిషి 'కళాబంధు' టి. సుబ్బరామిరెడ్డి. టీఎస్సార్ లలిత కళా పరిషత్ ఆధ్వర్యంలో హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, బెంగళూరు, విశాఖపట్టణం నగరాల్లో పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఆయన నిర్వహించారు. ఇప్పుడు కాకతీయుల వైభవాన్ని చాటి చెప్పే విధంగా 'కాకతీయ కళా వైభవ మహోత్సవం' నిర్వహించనున్నట్టు తెలిపారు. టీఎస్సార్ కాకతీయ లలిత కళా పరిషత్ ఆధ్వర్యంలో ఈ నెల 17న హైదరాబాద్ లో జరగనున్న ఈ వేడుక వివరాలు తెలియజేయడం కోసం శనివారం పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు.

టి. సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ- "కాకతీయుల పరిపాలన స్వర్ణయుగం. 600 ఏళ్ల క్రితమే తెలుగు సంస్కృతి, నాగరికతలు ఘనంగా చాటారు. కళల్ని పోషించారు. ఎన్నో గొప్ప దేవాలయాలను శిల్పకళా నైపుణ్యం, చాతుర్యంతో నిర్మించారు. శ్రీకృష్ణదేవరాయల కంటే ముందు నుంచి తెలుగుజాతికి వారసత్వాన్ని అందించారు. వరంగల్ రాజధానిగా 300 ఏళ్లు తెలుగువారిని పరిపాలించారు. వాళ్ల పేరు మీద 'కాకతీయ కళా వైభవ మహోత్సవం' చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఈ నెల 17న హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ఈ వేడుక నిర్వహిస్తాం. మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు చేతుల మీదుగా వేడుక ప్రారంభమవుతుంది. ఈ వేడుకలోనే సుమారు 560 చిత్రాల్లో నటించి, చిత్రపరిశ్రమలో 42 ఏళ్లు పూర్తి చేసుకున్న మోహన్ బాబును 'విశ్వ నట సార్వభౌమ' బిరుదుతో సత్కరిస్తున్నాం. పలువురు ఆధ్యాత్మిక, రాజకీయ, సినీ, సాంస్కృతిక ప్రముఖులు ఈ మహోత్సవానికి హాజరు కానున్నారు. తర్వాత తెలంగాణలోని వరంగల్, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్, మహబూబ్ నగర్ తదితర ప్రాంతాల్లో రెండు మూడు నెలలకు ఒకసారి కాకతీయ సాంస్కృతిక మహోత్సవాలు నిర్వహిస్తాం'' అన్నారు.

మోహన్ బాబు మాట్లాడుతూ- "కళాకారులను, కళలను గౌరవించే వ్యక్తుల్లో టి. సుబ్బరామిరెడ్డిగారు ముందుంటారు. కాకతీయుల కళా వైభోగాన్ని ప్రజలకు చాటి చెప్పాలనుకోవడం అభినందనీయం. ఇక, నాకు ఇవ్వనున్న 'విశ్వ నట సార్వభౌమ' బిరుదు గురించి ముందు చెప్పగానే... 'బిరుదులు నాకు ఎందుకు?' అన్నాను. వద్దని విశాఖలో చెప్పాను. మళ్లీ ఇప్పుడు ఇస్తున్నట్టు చెప్పారు. దాంతో ఆయన అభీష్టాన్ని కాదనలేకపోయా'' అన్నారు.

ఈ కార్యక్రమంలో రచయిత-నటుడు పరుచూరి గోపాలకృష్ణ, 'లయన్ క్లబ్' సభ్యులు, 'కాకతీయ కళా వైభవ మహోత్సవం' ఉత్సవ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్, కూచిపూడి నృత్య కళాకారిణిలు పద్మజ, సుజాతలు పాల్గొన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.