close
Choose your channels

సీన్ మార్చేసిన టీఆర్ఎస్.. కాంగ్రెస్‌తోనే కేసీఆర్!!

Tuesday, May 14, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సీన్ మార్చేసిన టీఆర్ఎస్.. కాంగ్రెస్‌తోనే కేసీఆర్!!

గులాబీ బాస్ కేసీఆర్.. కాంగ్రెస్‌తో చేతులు కలుపుతున్నారా..? కాంగ్రెస్సే కేసీఆర్‌తో చేతులు కలుపుతోందా..? ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీలో భాగస్వామ్యం కావాలని సీఎం భావిస్తున్నారా..? అంతా అనుకున్నట్లు జరిగితే కేసీఆర్-కాంగ్రెస్‌ ఒక్కటవుతారా..? ఫెడరల్ ఫ్రంట్ అనేది లేకుండా కాంగ్రెస్‌కే కేసీఆర్ మద్దతివ్వబోతున్నారా...? అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే ఇదే అక్షరాలా నిజమనిపిస్తోంది.

అప్పుడలా.. ఇప్పుడలా.!!

దేశ రాజకీయాల్లో సమూలమైన మార్పులు తీసుకురావాలని.. రాష్ట్రాల హక్కులను జాతీయ పార్టీలు కాలరాస్తున్నాయని.. ఏ రాష్ట్రం హక్కులు.. ఆ ప్రభుత్వానికే ఉండాలని.. రాష్ట్రాల బాట పట్టి కాంగ్రెస్, బీజేపీ యేతర ఫ్రంట్‌‌ను ఏర్పాటు చేసి ఢిల్లీలో చక్రం తిప్పాలని కేసీఆర్ భావించిన సంగతి తెలిసిందే. అయితే కేసీఆర్ అటు తిరిగి.. ఇటు తిరిగి ఆఖరికి ఏ కాంగ్రెస్‌కో.. బీజేపీకో మద్దతిస్తారని భావించారు. అయితే ముందుగా అనుకున్నట్లే.. జరిగిపోయింది. గత కొద్దిరోజులు టీఆర్ఎస్ పార్టీని కాస్త నిశితంగా గమనిస్తే క్రమేణా మార్పులు వచ్చినట్లు స్పష్టమవుతోంది. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్‌కు మద్దతివ్వడానికి మా బాస్ రెడీగా ఉన్నారని టీఆర్ఎస్ అధికార ప్రతినిధి అబిద్ రసూల్ ఖాన్ అన్నట్టు పీటీఐ తన కథనంలో పేర్కొంది.

ఇంతకీ రసూల్ ఏమన్నారు..?

"మా పార్టీ అధినేత కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్‌కు కాంగ్రెస్ మద్దతు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఆ ఫ్రంట్ స్టీరింగ్ (సారథ్యం) మాత్రం ప్రాంతీయ పార్టీల దగ్గరే ఉండాలి. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతోనే చర్చలు జరిపేందుకు కేసీఆర్ సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా మెజార్టీ రాని పక్షంలో.. కాంగ్రెస్ పార్టీ బయటి నుంచి ఫెడరల్ ఫ్రంట్‌కు మద్దతు ఇవ్వొచ్చు. ప్రధాని పదవి ఫెడరల్ ఫ్రంట్‌లోని పార్టీలకు చెందిన నేత అవుతారు. కూటమి నేతల మధ్య చర్చలు జరిగిన తరువాత నిర్ణయం తీసుకుంటారు. ఫెడరల్ ఫ్రంట్ ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ మద్దతు తీసుకునే అవకాశం లేదు" అని రసూల్ చెప్పుకొచ్చారు. లోక్ సభ ఎన్నికల ఫలితాలు రావడానికి మరో వారం రోజుల సమయం మాత్రమే ఉన్న సమయంలో టీఆర్ఎస్ నేత ఈ వ్యాఖ్యలు చేయడం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.

ఫలితాల తర్వాత కేసీఆర్ సమావేశం!

అంతటితో ఆగని ఆయన.. ఎన్నికల ఫలితాలు అనంతరం ప్రాంతీయ పార్టీలో కేసీఆర్ ఓ సమావేశం నిర్వహిస్తారని ఎస్పీ, బీఎస్పీ, వైసీపీ, డీఎంకే, టీఆర్ఎస్ వంటి పార్టీలు మంచి ఫలితాలు సాధిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి వందకు మించి సీట్లు వచ్చే అవకాశం లేదని.. కాంగ్రెస్ పార్టీ 180-200 సీట్లను సొంతంగా గెలుచుకోలేని పక్షంలో డీఎంకే వంటి పార్టీలు కూడా ఫెడరల్ ఫ్రంట్‌లోకి వస్తాయని.. మా అధినేత ఇప్పటికే కర్ణాటకలో జేడీఎస్‌, కేరళలోని వామపక్షాలతోనే చర్చలు జరిపారన్న విషయాన్ని గుర్తు చేశారు.

మొత్తానికి చూస్తే.. టీఆర్ఎస్ స్వరం మారిందని స్పష్టంగా తెలుస్తోంది. అయితే రసూల్ వ్యాఖ్యలపై ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి. టీఆర్ఎస్ నేతలు ఈ విషయాలు చెప్పలేక ఆయనతో చెప్పించారా..? లేకుంటే ఇవనీ రసూల్ అభిప్రాయాలా..? అన్నది తేలాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.