close
Choose your channels

నిరూపిస్తే రాజధాని సెంటర్‌లో ఉరేసుకుంటా: వైసీపీ ఎమ్మెల్యే

Wednesday, April 22, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నిరూపిస్తే రాజధాని సెంటర్‌లో ఉరేసుకుంటా: వైసీపీ ఎమ్మెల్యే

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకూ విజృంభిస్తోంది. ఈ తరుణంలో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ప్రభుత్వానికి సలహాలు లేదా తమకు తోచిన సాయం చేయాల్సిన ప్రతిపక్షాలు మాత్రం అనవసర రాద్ధాంతాలన్నీ తెరపైకి తెచ్చి ఇష్టానుసారం మాట్లాడేస్తున్నాయని అధికార పార్టీకి చెందిన నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. ముఖ్యంగా కర్నూలు, గుంటూరు జిల్లాల్లో ఎక్కువగా కేసులు నమోదవుతున్న తరుణంలో వైసీపీ ఎమ్మెల్యేలే అందుకు కారణమని మాజీ మంత్రి, టీడీపీ మహిళానేత భూమా అఖిల ప్రియ సంచలన ఆరోపణలు చేశారు. శ్రీకాళహస్తిలో స్థానిక ఎమ్మెల్యే ర్యాలీ వల్ల 8మంది ప్రభుత్వ ఉద్యోగులు కరోనా బారిన పడ్డారని ఆరోపించారు. వైరస్ విస్తరణకు కారణమైన ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆరోపించారు. అఖిల వ్యాఖ్యలకు కర్నూలు సిటీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ స్పందించారు.

నిరూపిస్తే ఉరేసుకుంటా..!

ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. తన వల్లే వైరస్ వ్యాప్తి చెందినట్టు నిరూపించాలని.. అదే నిజమైతే రాజధాని సెంటర్‌లో ఉరేసుకుంటానని ప్రతిసవాల్ విసిరారు. ‘దమ్ము ధైర్యం ఉంటే నిరూపించండి. మీకే కాదు. ఎవరికైనా సరే నాపై విచారణ చేసినా వేయండి. మేం తప్పు చేసి ఉంటే, మా కర్నూలులో రాజుగారి సెంటర్ అని ఉంది. అక్కడ మమ్మల్ని ఉరితీయండి. రెడీగా వెళ్తాం.. అందరికన్నా ముందు మసీదులు బంద్ నేను చేయించా. తబ్లిగీ జమాత్ నుంచి వచ్చిన వారి ఇంటింటికీ వెళ్లి వారికి, మతగురువులకి, సంస్థలకు చెప్పి 24 గంటల్లో వారిని క్వారంటైన్ కేంద్రాలకు తీసుకుని వెళ్లాను’ అని హఫీజ్ ఖాన్ చెప్పుకొచ్చారు.

సీఎంపైనా అఖిల విమర్శలు..

‘రాష్ట్రంలో కరోనా కేసులు పెరగడానికి ప్రభుత్వం కరోనాను తక్కువగా అంచనా వేయడమే. మన దేశంలో కరోనా కేసులు పెరిగిపోతోన్న సమయంలో ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సిల్లీగా తీసి పడేసింది. అది మామూలు జ్వరమేనని ప్రకటించింది. పారాసిటిమల్ వేసుకుంటే తగ్గిపోతుందని చెప్పింది. ఈ తప్పుడు సమాచారాన్ని ప్రభుత్వం ప్రజల్లోకి తీసుకెళ్లడం వల్లే ఏపీలో కరోనా పెరిగిపోతోంది. ప్రభుత్వ తీరులో ప్రజలు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కరోనాను చాలా లైట్‌గా తీసుకున్నారు. కరోనా విజృంభణతో రాష్ట్రంలో ఎన్నికల కమిషన్‌ స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేసింది. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడికి చర్యలు తీసుకుని ఉంటే బాగుండేది. సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ఎన్నికలపై పెట్టిన దృష్టిని కరోనాపై పెట్టలేదని అర్థమవుతోంది. పబ్లిసిటీ కోసం వైసీపీ నేతలు చేస్తోన్న పనులతో రాష్ట్రంలో కరోనా పెరిగిపోతోంది. అధికారులు తమ పనులను పక్కనపడేసి వైసీపీ నేతల వెనుక నిలబడి వారు చేస్తోన్న ఆర్భాటాలను చూస్తూ ఉండిపోవాల్సి వస్తోంది’ అని అఖిల ప్రియ సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై కర్నూలు జిల్లా వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.