close
Choose your channels

ఇండియాలో రికార్డ్ బ్రేక్ చేసిన వైసీపీ ఎంపీ

Saturday, May 25, 2019 • తెలుగు Comments

రాజకీయాల్లో సరిగ్గా ఓనమాలు కూడా రాని వయస్సులో ఎంట్రీ ఇచ్చి.. కనివినీ ఎరుగని రీతిలో ఫ్యాన్ హవాతో అరకు ఎంపీ గొడ్డేటి మాధవి ఇండియాలోనే రికార్డు సృష్టించారు. అంతేకాదు రాజకీయ ఉద్ధండుడిపై భారీ మెజార్టీతో విజయాన్ని సొంతం చేసుకోవడం మరో రికార్డ్. కాగా మాధవి కేవలం 25 ఏళ్ల 3 నెలల వయసుకే ఎంపీగా ఎన్నికై లోక్‌సభ చరిత్రలోనే అత్యంత పిన్నవయస్కురాలైన ప్రతినిధిగా రికార్డుకెక్కారు.

ఇంతకు ముందు ఈ రికార్డు 2014 ఎన్నికల్లో హర్యానా రాష్ట్రం హిసార్‌ లోక్‌సభ స్థానం నుంచి జననాయక్‌ జనతా పార్టీ (జేజేపీ) తరపున గెలుపొందిన దుష్యంత్‌ చౌతాలా పేరు ఉండేది. ఈయన ఎంపీగా గెలిచే సమయానికి వయసు 26 ఏళ్ల 13 రోజులు. అయితే ఆ రికార్డును గొడ్డేటి మాధవి చెరిపేసి చరిత్ర పుటల్లో నిలిచారు. 

విశాఖ జిల్లా అరకు పార్లమెంటరీ నియోజక వర్గం నుంచి వైసీపీ తరపు మాజీ ఎమ్మెల్యే గొడ్డేటి దేముడు కుమార్తె మాధవి పోటీ చేశారు. అయితే ఈమెకు ఎంపీ టికెట్ ఇస్తారని గాని.. ఒక వేళ ఇస్తే ఈమె గెలుస్తుందని కానీ బహుశా కలలో కూడా ఊహించి ఉండరేమో. ఓ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ ఆరు నెలల క్రితం జగన్‌ ప్రజాసంకల్ప యాత్ర సందర్భంగా  వైసీపీలో చేరి రాజకీయ అరంగేట్రం చేశారు. తమలోని ఒకరిగా భావించిన గిరిజనం ఆమెకు భారీ మెజార్టీతో పట్టం కట్టారు. ఈమెపై తెలుగుదేశం పార్టీ తరపున సీనియర్‌ పార్లమెంటేరియన్‌, మాజీ మంత్రి వైరిచర్ల కిశోర్‌చంద్రదేవ్‌ పోటీచేసి రికార్డ్ మెజార్టీతో వైసీపీ జెండా ఎగరేశారు. 

కాగా అరకు అసెంబ్లీ, పార్లమెంట్ రెండూ వైసీపీకి కంచుకోటలే. 2014 ఎన్నికల్లో అరకు ఎమ్మెల్యేగా కిడారి సర్వేశ్వరరావు గెలిచి టీడీపీలో జంపయ్యారు. ఆ తర్వాత మావోల కాల్పుల్లో ఆయన చనిపోయారు. అనంతరం కిడారి కుమారుడు శ్రవణ్‌ను కేబినెట్‌లోకి తీసుకున్న చంద్రబాబు.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎమ్మె్ల్యే టికెట్ ఇవ్వగా ఆయన కంటే నోటాకే ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. ఇదిలా ఉంటే..  పార్లమెంట్ స్థానం నుంచి గత ఎన్నికల్లో కొత్తపల్లి గీత వైసీపీ తరఫున పోటీ చేసి పార్టీకి దూరమై ఆమె సొంతంగా పార్టీ పెట్టుకోగా ఈ ఎన్నికల్లో ఆమెకు డిపాజిట్లు దక్కలేదు. ఈ పార్లమెంట్, అసెంబ్లీ సెగ్మెంట్‌లో గిరిజనులు ఎక్కువగా ఉన్నారు. ఈ కారణంగానే తమలో ఒకరైన అచ్చమైన గిరిజన యువతిగా మాధవిని ఏజెన్సీ వాసులు ఆదరించారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Get Breaking News Alerts From IndiaGlitz