close
Choose your channels

అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు : పవన్

Tuesday, January 7, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు : పవన్

రాజధాని రైతులు ప్రజాస్వామ్య పద్ధతిలో, శాంతియుతంగా నిరసన తెలియచేస్తుంటే ప్రభుత్వం రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తోందని.. ఇవాళ చినకాకాని దగ్గర రైతులతో పోలీసులు వ్యవహరించిన తీరు సమర్థనీయం కాదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. రాజధాని రైతులు చేపడుతున్న ఆందోళన కార్యక్రమాలపై పవన్ కల్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు. రైతులను, మహిళలను భయపెట్టి వారిని నిరసన నుంచి దూరం చేయాలని ప్రభుత్వం చూస్తోందని జగన్ సర్కార్‌పై ఆయన విమర్శలు గుప్పించారు. ఇవాళ నిరసన మొదలుకాక ముందే జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు బోనబోయిన శ్రీనివాస యాదవ్‌ను గృహ నిర్బంధంలో ఉంచడం.. పార్టీ కార్యదర్శి చిల్లపల్లి శ్రీనివాస్‌ను కారణం చెప్పకుండానే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించడం.. ఇలాంటి చర్యలతో ఆందోళనలను ఆపగలమని ప్రభుత్వం భావిస్తే అది పొరపాటే అవుతుందని పవన్ ప్రకటనలో రాసుకొచ్చారు.

సీమ నుంచి విశాఖకు కష్టం కదా!?
‘అమరావతి నుంచి రాజధానిని తరలించి భూములు త్యాగం చేసిన రైతులకు అన్యాయం చేస్తున్నారు. విశాఖపట్నం వాసులు కూడా పరిపాలన రాజధాని విషయంలో సంతృప్తిగా కనిపించడం లేదు. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో తీవ్ర వెనకబాటుతనం ఉంది. అక్కడి నుంచి వలసలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఆ జిల్లాల అభివృద్ధిపై ఈ ప్రభుత్వానికి ఎలాంటి ప్రణాళికలు లేవు. రాయలసీమవాసులకీ విశాఖపట్నం అంటే దూరాభారం అవుతుంది. సీమ నుంచి విశాఖ వెళ్ళాలి అంటే ప్రయాణం ఎంతో కష్టతరం. ఈ విషయమై సీమవాసుల నుంచి వ్యక్తమవుతున్న వ్యతిరేకతను వై.సి.పి.ప్రభుత్వం పట్టనట్టుగానే వ్యవహరిస్తోంది’ అని పవన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

త్రిశంకు రాజధానిగా మారుతోంది..!
‘రాజధాని మార్పు అనేది ఉద్యోగులకీ ఎన్నో ఇబ్బందులు సృష్టిస్తోంది. హైదరాబాద్ నుంచి అమరావతికి తరలి వెళ్లిన ఉద్యోగులు తమ పిల్లలను విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో చదివిస్తున్నారు. ఇప్పుడిప్పుడే కుదురుకొంటున్నారు. వాళ్ళను మళ్ళీ విశాఖకు పంపిస్తే వారి కుటుంబాలుకి ఎన్నో వ్యయ ప్రయాసలకు లోనవుతాయి. అన్ని ప్రాంతాలకు ఇది త్రిశంకు రాజధానిగా మారుతోంది. ఎవరికీ సంతృప్తి కలిగించటం లేదు. తాము భూములు త్యాగం చేసిన ప్రాంతంలోనే రాజధాని ఉంచాలని అమరావతి ప్రాంతవాసులు కోరుతున్నారు. రైతులు, మహిళలు, అన్ని వర్గాల ప్రజలు రాజధాని ప్రాంతంలో చేసిన మహా పాదయాత్ర వారి ఆవేదనకు అద్దంపట్టింది. వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తూ ఆందోళనలను అణచివేయాలని చూస్తే అంతకంటే బలంగా ఆందోళనలు చేపడతారని ప్రభుత్వం గ్రహించాలి’ అని పవన్ కళ్యాణ్ ప్రకటనలో తెలిపారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.